May 25,2023 16:53

తెహ్రాన్‌   :   ద్రవ ఇంధనంతో కూడిన ఖోరామ్‌షహర్‌-4 బాలిస్టిక్‌ క్షిపణి తాజా వెర్షన్‌ను చిత్రాలను ఇరాన్‌ గురువారం విడుదల చేసింది. అణ్వాయుధాలపై పశ్చిమదేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌ ఈ క్షిపణిని ప్రదర్శించడం గమనార్హం. తెహ్రాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రక్కులో అమర్చిన లాంచర్‌పై క్షిపణి ఖరామ్‌షహర్‌-4ను మీడియాకు ప్రదర్శించారు. త్వరలో ఈ క్షిపణిని ప్రయోగించేందుకు సిద్ధం చేయవచ్చని రక్షణ మంత్రి జనరల్‌ మొహ్మద్‌ రెజా అస్తియాని తెలిపారు. 1500 కిలోల ( 3,300 పౌండ్ల) బరువు కలిగిన ఈ క్షిపణి రెండు వేల కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని చేధించగలదని అన్నారు. అలాగే ఈక్షిపణి ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను కూడా అధికారులు విడుదల చేశారు. అయితే ప్రయోగం ఎప్పుడు, ఎక్కడ చేపట్టారన్న వివరాలు వెల్లడించలేదు.
1980లో ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధంలో భారీ పోరాటాలు జరిగిన ఇరాన్‌లోని నగరం ఖరామ్‌షహర్‌ పేరును ఈ క్షిపణికి పెట్టారు. అలాగే 7వ శతాబ్దంలో ముస్లింలు స్వాధీనం చేసుకున్న యూదుల కోట పేరుమీద ఈ క్షిపణిని ఖైబార్‌ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇది సౌదీ అరేబియాలో ఉంది.