Jun 23,2021 18:20

హైదరాబాద్‌ : తెలుగు సినీపరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష పదవికి చతుర్ముఖ పోటీ నెలకొనడంతో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఈ ఏడాది మరింత ఉత్కంఠగా జరగనున్నాయి. సెప్టెంబర్‌లో జరగనున్న 'మా' అధ్యక్ష రేసులో ఈసారి నలుగురు పోటీ పడనున్నారు. ఓ వైపు విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌, మరోవైపు హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జీవిత రాజశేఖర్‌ కూడా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు మద్దతు కూడగడుతున్నారు. ఈ ముగ్గురే కాకుండా మరో సీనియర్‌ సహాయ నటి హేమ కూడా 'మా' అధ్యక్ష పదవి రేస్‌లోకి దూసుకొచ్చారు. దీంతో 'మా' రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కాగా, ఇప్పటికే మెగా ఫ్యామిలీ మద్దతుతో ప్రకాశ్‌ రాజ్‌ పోటీ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబు ప్రకాశ్‌ రాజ్‌కు తన మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ప్రకాశ్‌ రాజ్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండొచ్చని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఇక, తండ్రి మోహన్‌బాబు ఆశీస్సులతో మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటీనటులను విష్ణు సంప్రదించి ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు విష్ణు తన తండ్రి మోహన్‌బాబుతో వెళ్లి కృష్ణను కలిశారు. ఈ ఫొటోలు కొన్ని బయటకు వచ్చాయి. మరోపక్క ప్రముఖ నటుడు రాజశేఖర్‌ సతీమణి జీవిత సైతం బరిలోకి దిగుతోంది. ఈ మేరకు మద్దతు కూడగడుతోంది. ప్రస్తుతం జీవిత 'మా' కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ముగ్గురే కాకుండా మరో సీనియర్‌ సహాయ నటి హేమ కూడా 'మా' అధ్యక్ష పదవి రేస్‌లోకి దూసుకొచ్చారు. గతంలో మా అసోసియేషన్‌లో ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఇసి సభ్యురాలిగా పనిచేసిన హేమ.. మహిళా నటీమణుల మద్దతుతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తొలుత ట్రెజరర్‌ పదవికి పోటీ చేయాలని అనుకున్న హేమ.. తనవారి కోసం అధ్యక్ష పదవి రేస్‌లోకి దిగబోతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఏర్పడి ఇప్పటికి 26 ఏళ్లవుతుంది. అందులో ప్రస్తుతం 926 మంది సభ్యులున్నారు. తొలిసారిగా ఈ అసోసియేషన్‌కు మెగాస్టార్‌ చిరంజీవి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో సీనియర్‌ నటులు మోహన్‌ బాబు, నాగార్జున, మురళీ మోహన్‌, నాగబాబు, రాజేంద్రప్రసాద్‌ పనిచేశారు. కాగా రాజేంద్రప్రసాద్‌, జయసుధ మధ్య పోటీ జరిగిన సమయంలో 'మా' ఎన్నికలు రసవత్తరంగా మారి సాధారణ ఎన్నికలను తలపించాయి. ఆ తర్వాత సీనియర్‌ నటులు నరేశ్‌, శివాజీ రాజాల మధ్య ఎన్నికలు జరిగినప్పుడు మాటల యుద్దాలు నడిచాయి. గత ఎన్నికల్లో నరేశ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గడిచిన నాలుగేళ్ల నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన 'మా' అసోసియేషన్‌ ఎన్నికల్లో ఈ దఫా ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీ చేయనుండటం వల్ల మరోసారి రసవత్తరంగా మారనున్నాయి.