Nov 25,2022 17:30

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌ తర్వాత టాలీవుడ్‌లో కామెడీ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్‌. ఒకప్పుడు కామెడీ చిత్రాలతో వరుస హిట్లతో దూసుకుపోయిన నరేష్‌.. ఆ తర్వాత పరాజయాల్ని ఎదుర్కొన్నాడు. దీంతో కామెడీ జోనర్‌ని మార్చి.. సీరియస్‌ పాత్రల్లో నటిస్తున్నాడు. ఇటీవల 'నాంది' సినిమాలో నటించి అందరి ప్రశంసల్ని అందుకున్న నరేష్‌... ఇప్పుడు తాజాగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా నవంబర్‌ 25న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమాతో నరేష్‌ ప్రేక్షకులను మెప్పించాడో లేదో తెలుసుకుందామా..?!

కథ
శ్రీపాద శ్రీనివాస్‌ (అల్లరి నరేష్‌) ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేస్తుంటారు. ఎన్నికల విధుల్లో భాగంగా శ్రీనివాస్‌ మారేడుమిల్లికి వెళ్తాడు. స్వతహాగా కష్టాల్ని చూసి చలించిపోయే శ్రీనివాస్‌.. ఆ గ్రామంలోని ప్రజలు విద్య, వైద్యం, రోడ్డు సదుపాయాల్లేక కష్టాలుపడుతున్న వారిని చూసి చలించిపోతాడు. అక్కడి ప్రజలు ఎన్నిసార్లు వారి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఫలితం శూన్యం. దీంతో మారేడుమిల్లి ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనకూడదని నిర్ణయం తీసుకుని భీష్మించుకు కూర్చుంటారు. ఎన్నికల విధుల్లో అక్కడకు చేరిన శ్రీనివాస్‌ అక్కడి ప్రజల్ని ఒప్పించి ఓటింగ్‌లో పాల్గొనేలా చేశాడా? ఈ ప్రయత్నంలో అతనికి లక్ష్మీ (ఆనంది) ఎలా సహాయం చేసింది? చివరికి అక్కడి ప్రజల కష్టాలు తీరాయా? ప్రభుత్వాధికారులు స్పందించారా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

naresh


విశ్లేషణ
ట్రైలర్‌లో సీరియస్‌నెస్‌ కనిపిస్తేగాని సినిమా చూడ్డానికి ఇప్పటి ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. అలాంటి పరిస్థితుల్లో సీరియస్‌ కథను తెరకెక్కించడం, అందులో నటించడానికి నరేష్‌ ఒప్పుకోవడం పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. ఇక సినిమా విషయానికొస్తే.. ఫస్టాఫ్‌లో శ్రీనివాస్‌ పరిచయం.. టీచర్‌గా విధులు నిర్వర్తించడం వంటి సన్నివేశాలు సాదాసీదాగానే ఉన్నాయి. ఇక విధుల్లో భాగంగా మారేడుమిల్లికి వెళ్లడంతోనే కథపై ఆసక్తి కలుగుతుంది. అక్కడున్న ప్రజలు, వారు పడుతున్న కష్టాల్ని చూసి శ్రీనివాస్‌ చలించిపోయే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఓ గిరిజన యువతి ప్రసవ సమయంలో శ్రీనివాస్‌ చేసే సాయంతో అక్కడి ప్రజల మనసు మార్చి ఎన్నికల్లో పాల్గొనేలా చేసే ప్రయత్నం ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది. శ్రీనివాస్‌ ప్రయత్నంతో అక్కడి వందశాతం పోలింగ్‌ జరుగుతుంది. పోలింగ్‌ అయిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులతో తిరిగి వెళ్తున్న శ్రీనివాస్‌, అతని సహచరుల్ని (వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌) ఆ గిరిజన తండాకు చెందిన కండా (శ్రీతేజ) కిడ్నాప్‌ చేస్తాడు? ఆ తర్వాత ఏం జరగబోతుందనేదానిపై ఉత్కంఠను కలిగిస్తూ విరామమొస్తుంది. ఇక సెకండాఫ్‌లో కిడ్నాప్‌ చేసిన వారిని విడిపించడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలతో కథనం సాగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం చేసే హడావిడి సన్నివేశాలతో నడుస్తుంది. ఇలాంటి సన్నివేశాలు అన్ని సినిమాల్లోగానే సాగదీతగా ఉన్నాయి. అయితే ప్రీ క్లైమాక్స్‌... క్లైమాక్స్‌ సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి. క్లైమాక్స్‌ ప్రేక్షకుడు ఊహించిందే అయినప్పటికీ.. దర్శకుడు నటీనటులచే హృద్యయంగా చెప్పించిన తీరు బాగుంది. ఇక ఫస్టాఫ్‌లో ప్రజల సమస్యలను చూపుతూనే వెన్నెల కిషోర్‌తో దర్శకుడు తెరపై హాస్యాన్ని పండించాడు. కామెడీ టైమింగ్‌లో నరేష్‌ తగ్గి... వెన్నెల కిషోర్‌కి, ప్రవీణ్‌కి ఆ స్థానం ఇవ్వడం అభినందించదగ్గది. సినిమాలో ఆ పాత్రకు తగ్గట్టుగా మొదటి నుంచి చివరి దాకా నరేష్‌ పాత్రధారణ సీరియస్‌గానే కనిపిస్తుంది. అది సినిమాకు ప్లస్‌. అబ్బూరి రవి రాసిన మాటలు 'తప్పు చేసి శిక్ష పడినా పర్వాలేదు.. సాయం చేసి బాధపడకూడదు', 'మనందరం గొప్పవాళ్లం అయిపోవాలని అనుకుంటున్నాం. కానీ ఎవరూ మనిషి కావడం లేదు' ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు చివరికి ఓ మంచి ఫీల్‌తో ప్రేక్షకులు థియేటర్‌ బయటకు వస్తారు. దర్శకుడు ఏఆర్‌ మోహన్‌ ప్రతిభ తెరపై కనిపిస్తుంది.

naresh 6


ఎవరెలా చేశారంటే
హీరోగా నరేష్‌ లుక్‌, నటన ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్‌గా ఆనందికి సినిమాలో పెద్దగా స్కోప్‌ లేకపోయినా పాత్ర పరిధిమేరకు బాగానే నటించింది. ఇక కలెక్టర్‌గా సంపత్‌, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, రఘుబాబు తదితర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. శ్రీచరణ్‌ పాకాల పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

naresh 7

 

narehs