Aug 06,2022 23:36

ప్రజాశక్తి - విశాఖపట్నం
నాటి విశాఖ జిల్లా మహిళలు పెద్ద సంఖ్యలో జాతీయోద్యమంలో పాల్గొన్నారు. పలువురు బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొని శిక్షలు కూడా అనుభవించారు. ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన, క్విట్‌ ఇండియా కార్యక్రమాల్లో పెద్దసంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. ఎవిఎన్‌, ఆంధ్రా మెడికల్‌ కళాశాలల్లో అనేక మంది చదువులకు స్వస్తి చెప్పి, స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములయ్యారు.
యలమంచిలికి చెందిన కాలనాథభట్ల మహాలక్ష్మమ్మ శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహోద్యమాల్లో చురుకైన పాత్ర పోషించింది. 1920లో చోటుచేసుకున్న ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఆరునెలల కఠిన కారాగార శిక్ష అనుభవించింది. 1933లో శాసనోల్లంఘనలో ముందుపీఠిన నిలిచి మళ్లీ వెల్లూరు, కన్ననూరు జైళ్లలో శిక్ష అనుభవించింది. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని మరో మూడు మాసాలు జైలు పాలైంది. ఆమె 1967లో కన్నుమూసింది. యలమంచిలికి చెందిన మిస్సుల లక్ష్మీ నరసమ్మ శాసనోల్లంఘన ఉద్యమంలో అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించింది. గర్భిణిగా ఉన్న సమయంలో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని బ్రిటీషు నిర్బంధానికి గురైంది. నిండు గర్భిణి అయిన ఆమె అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో జైలు జీవితాన్ని అనుభవించింది. కన్ననూరు జైల్లో ఒక ఆడశిశువుకు జన్మనిచ్చింది. తిరిగి 1932 సెప్టెంబర్‌లో అరెస్టయి మరో నాలుగు నెలలు వెల్లూరు, కన్ననూరు జైళ్ళలో శిక్ష అనుభవించింది.
శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటీషు ప్రభుత్వం లింగమాంబకు రూ.200 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించగలిగిన స్థోమత ఉండి కూడా బ్రిటీషు పాలకుల ఎదుట తలవంచేందుకు లింగమాంబ సిద్ధపడలేదు. ఆరు నెలల జైలు జీవితాన్ని అనుభవించింది. యలమంచిలి మండలంలోని దిమిలి గ్రామానికి చెందిన ఈమె 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని మూడు నెలలు, వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని మూడు నెలలు కారాగార శిక్షను అనుభవించింది. క్విట్‌ ఇండియా ఉద్యమంలో ముందుపీఠిన నిలిచి మరో మూడు నెలల పాటు జైలు జీవితాన్ని గడిపింది. ఇదే గ్రామానికి చెందిన్ల సోదెమ్మ, లక్ష్మీ నరసమ్మ, శ్యామసుందరమ్మ ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొన్నారు. 1940లో నిర్వహించిన వ్యక్తి సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నందుకు సోదెమ్మ మూడునెలల జైలు శిక్ష అనుభవించింది. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని లక్ష్మీనరసమ్మ వెల్లూరు జైల్లో మూడునెలల పాటు, శ్యామ సుందరమ్మ ఏడునెలల పాటు కారాగార శిక్ష అనుభవించారు.
అనకాపల్లికి చెందిన దర్భా వెంకట రమణమ్మ శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని ఈ ప్రాంత మహిళలను కదిలించింది. ఇందుకోసం నాలుగు నెలలపాటు నెల్లూరు, వెల్లూరు జైళ్లలో శిక్ష అనుభవించింది. కొడుకుల కామేశ్వరమ్మ క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడు మాసాలపాటు వెల్లూరు జైల్లో శిక్ష అనుభవించింది. దేశాయి 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో తెల్లదొరల నిర్బంధానికి గురైంది. విశాఖపట్నం వాసి గుండుమల్ల రంగనాయకమ్మ శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని ఆరు మాసాల జైలుశిక్ష అనుభవించింది. స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన అందరి మహిళల పేర్లూ చరిత్రకెక్కక పోయినప్పటికీ జిల్లాలో ఏజెన్సీ, మైదాన ప్రాంతాల బ్రిటీషు వ్యతిరేక పోరాటంలో స్త్రీల పాత్ర అద్వితీయమైనది. మన్నెంలో అల్లూరి సీతారామరాజు నడిపిన బ్రిటీషు వ్యతిరేక పోరాటానికి గిరిజన మహిళలు అనూహ్యమైన సహాయ సహకారాలు అందించారు. రహస్యజీవితం గడుపుతున్న ఉద్యమకారులకు ఆహారాన్ని సమకూర్చి, వారి బట్టలు ఉతకడం తదితర పనులను చేయడం ద్వారా సహకరించారు. మరికొంత ఎన్ని ఒత్తిడులొచ్చినా, శారీరక, మానసిక హింసలు ఎదురైనా ఉద్యమ రహస్యాలను కడుపులో పెట్టుకొని స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నేడు దేశంలో అసమానతలు పెచ్చుమీరుతూ, సామాన్యుల బతుకులు ఛిద్రమవుతున్న తరుణంలో నాడు తెల్లదొరలను తరిమికొట్టిన ఉద్యమ గాథలను మననం చేసుకోవడం, ఆ స్ఫూర్తితో ఉద్యమించడం అత్యంత ఆవశ్యకం.