
ప్రజాశక్తి - శృంగవరపుకోట : పట్టణంలోని ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అకాడమీకి చెందిన మహమ్మద్ ఖలిలుల్లా (అస్లాం) ఈనెల 20వ తేది నుండి గోవాలో జరగబోవు జాతీయస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటు న్నట్లు చీఫ్ కోచ్ డాక్టర్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. గత నెలలో కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో విజయం సాధించి జాతియ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని అన్నారు. ఎంపికైన అస్లాంకు అభినందనలు తెలియజేస్తూ క్రీడా దుస్తులను, రవాణా ఖర్చులు నిమిత్తం రూ.10 వేలను ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎస్వి సత్యశేఖర్, స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అట్లూరి వెంకటరావు, ఆనల రమేష్, ఆనల మోహన్ అందజేశారు. ముంతాజ్ హోటల్ యాజమాన్యం షేక్ సిలార్ బ్రదర్స్ రూ. 10 వేలు బ్యాడ్మింటన్ క్రీడా కిట్‌ను, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్ ముగ్ధుం రూ. 5 వేల బ్యాడ్మింటన్ షూష్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు, తల్లిదండ్రులు, చీఫ్ కోచ్ శ్రీరాముల అభినందనలు తెలియజేశారు.