Jan 14,2022 10:36

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లాలో జైహింద్‌ నాయక్‌ (30) అనే మతి స్థిమితం లేని వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేసి అతని తలను మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద ఉంచిన ఘటన సంచలనాన్ని రేపిన సంగతి విదితమే. దర్యాప్తు చేపట్టిన పోలీసులు జైహింద్‌ నాయక్‌ మొండెంను పోలీసులు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని ఓ భవనంపై గుర్తించారు. మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నాగార్జున సాగర్‌, హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కనే విరాట్‌నగర్‌ కాలనీలో ఉన్న మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద దుండగులు మొండెం లేని జైహింద్‌ నాయక్‌ తలను ఉంచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా జైహింద్‌ మొండెంను ఓ భవనంలో గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా... క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో ఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.