Apr 08,2021 19:58

ప్రజాశక్తి - దెందులూరు
ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మండలవ్యాప్తంగా 67 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటర్లకు అన్ని సౌకర్యాలూ కల్పించామని ఎన్నికల అధికారి డి.లీలామోహన్‌ తెలిపారు. తహశీల్దార్‌ ఎన్‌.నాంచారయ్య పలు గ్రామాల్లో పర్యటించి పోలింగ్‌ తీరును పరిశీలించారు. మొత్తం 17 ఎంపిటిసి స్థానాల్లో పోటీ జరుగుతోంది. జడ్‌పిటిసి స్థానానికి వైసిపి నుండి నిట్ట లీలానవకాంతం, టిడిపి నుంచి కుచ్చెర్ల రమాదేవి, బిజెపి నుండి జంగం జోసప్సి బరిలో ఉన్నారు. సమస్యాత్మక గ్రామాలైన కొవ్వలి, పోతునూరు, దెందులూరు, శ్రీరామవరం, జోగన్నపాలెం, గోపన్నపాలెం, మసీదుపాడులో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని ఎస్‌ఐ దాడి రాంకుమార్‌ తెలిపారు. ఉదయం నుండి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోతునూరు, గంగన్నగూడెం, చల్లచింతలపూడి గ్రామాల్లో ఆందోళనలు జరిగినప్పటికీ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని తగు చర్యలు చేపట్టారు. మండలంలోని పోలింగ్‌ కేంద్రాలను గురువారం మండల ఎన్నికల అధికారి డి.లీలామోహన్‌ సందర్శించారు. దెందులూరు హైస్కూల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల గురించి ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఏ విధమైన అవకతవకలు జరగకుండా చూడాలని ఎన్నికల పిఒలకు ఆదేశించారు. తహశీల్దార్‌ నాంచారయ్య, ఎంపిడిఒ ఎ.లక్ష్మి పోలింగ్‌ బూత్‌లను సందర్శించారు.మండలంలో ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి డి.లీలామోహన్‌ తెలిపారు.ఎంపిటిసి ఓట్లు 62.4 శాతం పోలవ్వగా, జడ్‌పిటిసి ఓట్లు 58.22 శాతం పోలయ్యాయని తెలిపారు.
కామవరపుకోట : ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా రక్షణ చర్యలు చేపట్టామని జిల్లా ఎస్‌పి కె.నారాయణ నాయక్‌ అన్నారు. గురువారం పరిషత్‌ ఎన్నికల సందర్భంగా మండలంలో 63 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అంకాలమ్మ పాడు, కామవరపుకోట జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను ఎస్‌పి సందర్శించారు. ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉందన్నారు. జిల్లాలో 2,876 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏవిధమైన అవాంతరాలు తలెత్తకుండా రక్షణ చర్యలు చేపట్టాలని తడికలపూడి ఎస్‌ఐ కె.వెంకన్నకు, పోలీస్‌ సిబ్బందికి సూచనలిచ్చారు.
నిడమర్రు : జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు మండలంలోని 16 గ్రామాల్లో ప్రశాంతంగా జరిగినట్లు ఎంపిడిఒ టిఎస్‌ మహా లక్ష్మి తెలిపారు. భువనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఎంఎల్‌ఎ పుప్పాల వాసుబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగేయ భువనపల్లి రెండో సెగ్మెంట్‌ సిపిఎం అభ్యర్థి పద్మావతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గణపవరం: పరిషత్‌ ఎన్నికలు మండలంలో ప్రశాంతంగా జరిగాయి. 25 గ్రామాల్లో పోలింగ్‌ జరగడానికి వీలుగా 62 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్‌ ప్రారంభమైనా 10 గంటల వరకూ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు పెద్దగా రాకపోవడంతో పోలింగ్‌ నమోదు కాలేదు.
పెనుమంట్ర : మండలంలో జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు సాఫీగా సాగాయి. నత్తారామేశ్వరం పోలింగ్‌ కేంద్రం వద్ద సుమారు 11 గంటల సమయంలో భారీ క్యూ లైన్‌ ఉండడంతో ఓటర్లకు కూలిడింక్స్‌ పంపిణీ చేస్తున్న సమయంలో వైసిపి, టిడిపి నాయకులు మధ్య వాగ్వివాదం తలెత్తింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఎస్‌ఎన్‌ వివి రమేష్‌ పరిస్థితిని చక్కదిద్దారు. మహిళలకు కుర్చీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ముగిసే సమయానికి 63.17 శాతం పోలైనాయి. పురుషులు 23187 మందికి 14546 మంది, స్త్రీలు 24633 మందికి 15664 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 47820 మందికి 30210 మంది ఓటు వేశారు.
మొగల్తూరు : మండలంలోని గ్రామాల్లో నిర్వహించిన మండల పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎంపిడిఒ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఆచంట : మండలంలో పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికారులు, పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. వేసవి నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లు ఇబ్బందులు పడకుండా అధికారులు సదుపాయం కల్పించారు. టెంట్లు వేయడంతోపాటు వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆచంట ఎం.వి.ఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లు మండుటెండలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపిటిసి అభ్యర్థి బాలం రమేష్‌ టెంటుతో పాటు వాటర్‌ ప్యాకెట్లను సరఫరా చేశారు. అనంతరం ఓటర్ల స్లిప్పుల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆచంటలోని రామేశ్వరస్వామి సత్రం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తూరు ప్రాథమిక పాఠశాల, పెనుమంచిలి జడ్‌పి ఉన్నత పాఠశాల, కొడమంచిలి జడ్‌పి ఉన్నత పాఠశాల వల్లూరు పంచాయతీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకట్రావు, సహాయ ఎన్నికల అధికారులు ఎం.శ్రీనివాసరావు, మధుసూదనరావు, రాజశేఖర్‌ పోలింగ్‌ను పర్యవేక్షించారు.
తాడేపల్లిగూడెం : పెంటపాడు మండలంలో ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్‌టివిఎన్‌ హైస్కూల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని 59 పోలింగ్‌ కేంద్రాల్లో ఏవిధమైన ఘటనలు జరగకుండా ఎఎస్‌పి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో జయరాజు పరిశీలించారు. సిపిఎం అభ్యర్థి బడబళ్ల లక్ష్మీనారాయణ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
తాడేపల్లిగూడెం రూరల్‌ : తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం లో ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు ప్రశాంతగా జరిగినట్లు ఎంపిడిఒ జివికె మల్లికార్జునరావు తెలిపారు. మొత్తం 27 గ్రామాలకుగాను 22 ఎంపిటిసి, ఒక జడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయన్నారు. కృష్ణాపురంలో వైసిపి జడ్‌పిటిసి అభ్యర్థి ముత్యాల ఆంజనేయులు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరుగొలనులో టిడిపి జడ్‌పిటిసి అభ్యర్థి వట్టూరి రాంబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 63 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భీమవరం రూరల్‌: మండలంలోని పరిషత్‌ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరిగాయి. తుందుర్రులో జడ్‌పిటిసి అభ్యర్థి కాండ్రేగుల నరసింహారావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దేవరపల్లి :మండలంలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు సాఫీగా జరిగాయి. మొత్తం 20 ఎంపిటిసి, ఒక జడ్‌పిటిసి స్థానానికి ఎన్నికలు జరిగాయి. దేవరపల్లిలోని అంబటి సత్యనారాయణ రావు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 గంటల వరకూ పోలింగ్‌ మందకొడిగా సాగినా 2 గంటల తరువాత వేగవంతమైంది.
పెరవలి : మండలంలోని 18 గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ఎక్కువ మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు ఎండ బారిన పడకుండా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్దా షామియానాలు, తాగునీరు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల పరిధిలో అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు.
ఏలూరు కల్చరల్‌ : మండలంలోని ఏడు ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండలంలో మొత్తం 11 ఎంపిటిసి స్థానాలు ఉండగా నాలుగు స్థానాలు ఏకగ్రీవం కావడంతో మల్కాపురం, చాటపర్రులో - 2, జాలిపూడి, మాదేపల్లి లో-2, ప్రత్తికోళ్ల లంక ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్‌ మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఊపందుకుంది. పోలింగ్‌ కేంద్రాల్లో ధర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజర్‌ ఏర్పాటు చేయడంతో పాటు మాస్కు ధరించిన వారికి మాత్రమే లోపలికి అనుమతించారు. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాళ్లపూడి: పరిషత్‌ పోలింగ్‌ మండలంలో ప్రశాంతంగా జరిగింది. అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి రాజశేఖర్‌, కోడ్‌ పర్యవేక్షణాధికారి ఎం.నరసింహమూర్తి పోలింగ్‌ పనితీరును పరిశీలించారు. ఎస్‌ఐ జి.సతీష్‌ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్‌ నిర్వహించారు. ఏ గ్రామంలోనూ ఓటర్లు ఓటు వేయడానికి ఉత్సాహం కనబర్చలేదు. దీనికి ప్రధాన కారణం తాయిలాల పంపకాలు సరిగ్గా జరగకపోవడమే అని చెప్పుకోవచ్చు.
లింగపాలెం : మండలంలో 17 ఎంపిటిసి స్థానాలకు ఏడు స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 10 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మండలం వ్యాప్తంగా 59 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ఓటర్లకు తగిన సౌకర్యాలు కల్పించామని ఎంపిడిఒ శ్రీదేవి తెలిపారు. ఎంపిటిసి స్థానాలకు టిడిపి, వైసిపి పోటీ దారులు పోటీలో ఉండగా జడ్‌పిటిసి స్థానాలకు నాలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఉంగుటూరు : జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండలంలో 23 ఎంపిటిసి స్థానాలకు 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా జడ్‌పిటిసి స్థానానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 61570 ఓటర్లకు 44500 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74.12 శాతం పోలింగ్‌ నమోదైంది. వెల్లమిల్లిలో సాయంత్రం 6.30 వరకూ పోలింగు కొనసాగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు ఎంపిడిఒ ఎవి.విజయలక్ష్మి, తహశీల్దారు జాన్‌రాజు ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు.
కామవరపుకోట : మండలంలో జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 48,882 మంది ఓటర్లు ఉండగా పురుషులు 24144 మంది, మహిళలు 24736 మంది ఉన్నారు. ఓటింగ్‌ పక్రియ ముగిసేనాటికి 32419 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 16575 మంది పురుషులు, 15844 మంది స్త్రీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 66.32 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎంపిడిఒ డివిఎస్‌ పద్మని తెలిపారు.
ఉండ్రాజవరం:మండలంలో ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 22 ఎంపిటిసి స్థానాలకు, ఒక జడ్‌పిటిసి స్థానానికి ఎన్నికలు జరిగాయి. మండలంలో మొత్తం 59,713 మంది ఓటర్లుకు గాను 43,546 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 72.93 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ ఉదయం మందకొడిగా ప్రారంభమైనా మధ్యాహ్నానికి ఊపందుకుంది.
భీమడోలు : మండలంలోని జడ్‌పిటిసి, 12 ఎంపిటిసి స్థానాలకు నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జడ్‌పిటిసికి నలుగురు, ఎంపిటిసి స్థానాలకు 39 మంది పోటీలో నిలిచారు. 51,813 ఓటర్లకు గాను 30,334 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో 83 శాతం ఓటింగ్‌ నమోదై ఆ గ్రామ పంచాయతీ మండలంలో ప్రథమ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత 71 శాతం ఓటింగ్‌తో పొలసానిపల్లి, సూరప్పగూడెం రెండో స్థానం దక్కించుకున్నాయి. అత్యల్పంగా గుండుగొలను గ్రామ పంచాయతీలో కేవలం 40 శాతం ఓటింగ్‌ నమోదు కావడంతో ఆ గ్రామ పంచాయతీ పోలింగ్‌లో చివరి స్థానంలో నిలిచింది.
పెదపాడు : మండలంలో పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు పెదపాడు ఎస్‌ఐ జ్యోతిబసు తెలిపారు. మొత్తం 56,313 ఓటర్లకు గాను పురుషులు 16,512 మంది, స్త్రీలు 17,308 మంది, మొత్తం 33,821 మంది తమ ఓటు హక్కును వినియగించుకున్నారని తెలిపారు. మొత్తం 60.06 శాతం పోలింగ్‌ అయినట్లు తెలిపారు.
యలమంచిలి : పరిషత్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలో మొత్తం 49,720 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 25,026 మంది, స్త్రీలు 24,694 మంది ఓటర్లు ఉన్నారు. 18,660 మంది పురుషులు, 18,266 మంది మహిళా ఓటర్లు కలిపి మొత్తంగా 36,926 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునట్లు ఎంపిడిఒ త్రిశూల పాణి తెలిపారు.