
జిల్లా సమీక్షా సమావేశంలో ఇన్‌ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
పేదల సంక్షేమానికి రాష్ట్రంలో అమలవుతున్న 'నవరత్నాలు' దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర రవాణా శాఖామంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాలకు సమాన ప్రాధాన్యతిచ్చి దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విన్నూత్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత వైసిపికి దక్కుతుందన్నారు. పేదరికమే అర్హతగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థల పట్టాలు అందించడంతోపాటు, వారికి పక్కాగృహాలు మంజూరు చేశామన్నారు.
శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పధకాలను పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యకు అమలు చేయాలని కోరారు. కదల్లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి వారి ఇంటివద్దకు అధికారులను పంపించి పరిశీలించి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలోని ఉర్దూ పాఠశాలల్లోను, నాడు-నేడు కార్యక్రమంలో అదనపు తరగతి గదులను మంజూరు చేయాలని కోరారు. ఏలూరులో డిగ్రీ కళాశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనీ, తేమ 17 శాతానికి మించిన ధాన్యం కూడా కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చింతలపూడి ఎత్తిపోతల పధకం పనులు వేగవంతం చేయాలనీ, నిర్వాసితులకు పరిహారం అందించాలని కోరారు. గోదావరి వరదలకు 45.1 కాంటూరులోని గ్రామాలతో పాటు వాటి పరిధిలోకి రాని నాలుగు గ్రామాలు ముంపునకు గురయ్యాయని, వాటిని కూడా 45.1 కాంటూర్ పరిధిలోకి తీసుకురావాలన్నారు.
దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ రైతుభరోసా- పిఎం కిసాన్ నిధులు కొంతమంది రైతులకు జమ కాలేదని, ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలోని కొంతమంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధులు త్వరితగతిన జమయ్యేలా చూడాలన్నారు. రేషన్ కార్డులో నమోదైన పిల్లలకు ప్రయివేటు ఉద్యోగాలకు ఇతర ప్రాంతాలలకు వెళ్లడంతో ఆ రేషన్ కార్డులోని తల్లిదండ్రులకు పెన్షన్ మంజూరు కావడం లేదన్నారు. ముంపు మండలాల్లోని కొంతమంది రైతులకు రైతుభరోసా జమ కాలేదని, బుట్టాయగూడెంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలనీ, గిరిజన గ్రామాల్లో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలనీ, సత్యసాయి తాగునీటి పధకం పనులు త్వరితగతిన పూర్తిచేసి వాటి పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. గిరిజన ప్రాంతాలకు వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేసి గోదావరి జలాలతో తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. గిరిజన ప్రాంతాలకు తాగునీటి సౌకర్యానికి అవసరమైన ప్రతిపాదనలు సమర్పిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు. సమస్యలపై తగు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ విజయవాడలోని ఆరోగ్యశ్రీ వర్తించే కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిరాకరిస్తున్నారని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కైకలూరు ఎంఎల్ఎ దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో అమ్మఒడికి అర్హులైన 65 మందికి నిధులు మంజూరు కాలేదని, సామజిక సర్వే హౌస్ హోల్డ్ మాపింగ్ కారణంగా రేషన్ కార్డులోని పిల్లలు ఉద్యోగం చేస్తూ ఉన్న కారణంగా మంజూరు కాలేదని తెలియజేశారన్నారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం సరిపోవడం లేదని, నిర్దేశించిన మొత్తం కన్నా 20 శాతం పెంచి నిర్ణయించాలని కోరారు. ఉంగుటూరు ఎంఎల్ఎ పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ జగనన్న ఇళ్ల లే అవుట్లలో నీరు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, సరిపల్లి కాలనీలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలనీ కోరారు. ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని మాట్లాడుతూ రేషన్ కార్డులో నమోదైన పిల్లలకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు వెళ్లడంతో ఆ రేషన్‌కార్డులోని తల్లితండ్రులకు పెన్షన్ మంజూరు కావడం లేదని, ఒంటరి మహిళలకు పెన్షన్ మంజూరులో సమస్యలు వస్తున్నాయని, అర్హులైన వారికి పెన్షన్ మంజూరుకు సంబంధించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 2.28 లక్షల ఎకరాలలో రైతులు వరి సాగు చేశారని, ఇ-క్రాప్ నమోదు 99 శాతం పూర్తయిందన్నారు. మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ధాన్యం కొనుగోలుకు నూతన విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి రాహుల్ దేవ్ శర్మ, జెసి పి.అరుణ్‌బాబు, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంద్ర పాల్గొన్నారు.