Feb 06,2023 23:54

వైవి ఆంజనేయులకు హారతి ఇస్తున్న మహిళలు

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : జగన్‌ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు అన్నారు. నారా లోకేశ్‌ పాదయాత్రకు సంఘీభావంగా వైవి ఆంజనేయులు సోమవారం చేపట్టిన పాదయాత్ర సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లలో ప్రారంభమైంది. తొలుత ఎన్‌టిఆర్‌ విగ్రహానికి వైవి ఆంజనేయులు పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన పాదయాత్ర ముప్పాళ్ల మండలం తొండపి మీదుగా నకరికల్లు మండలం నరసింగపాడుకు చేరింది. పాదయాత్రకు మహిళలు, టిడిపి శ్రేణులు పలుచోట్ల ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైవి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రజల్ని ఉద్దరిస్తానంటూ ఎన్నికల్లో ఓట్లేయించుకున్న జగన్‌మోహన్‌రెడ్డి గెలిచాక ఎడాపెడా పన్నులు వడ్డిస్తున్నారని అన్నారు. మూడున్నరేళ్ల పాలనలో ఒక్క కంపెనీనైనా తెచ్చారా? జాబ్‌ కేలండర్‌ ప్రకటించారా? అని ప్రశ్నించారు. ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాని, ధరలు ఆకాశాన్నంటుతున్నారని విమర్శించారు. రైతులు ఆప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని సిఎం తాడేపల్లికే పరిమితమయ్యారని అన్నారు. అయితే లోకేశ్‌ మాత్రం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుండగా ప్రభుత్వం, పోలీసులు ఆటంకాలు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలని కోరారు. పాదయాత్ర సందర్భంలో వైవి ఆంజనేయులు ధూళ్లిపాళ్ల, తొండపి గ్రామాల్లో వ్యవసాయ కూలీలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం చాగల్లు మీదుగా, కండ్లకుంటకు పాదయాత్ర చేరింది. ఎస్సీ కాలనీలోని చర్చి కాంపౌండ్‌లో వైవి ఆంజనేయులు రాత్రి బస చేశారు. కార్యక్రమంలో వైవి ఆంజనేయులు కుమారుడు సుజిత్‌కుమార్‌, టిడిపి నాయకులు సిహెచ్‌.శ్రీనివాసరావు, బి.వందనాదేవి, ఎ.సాంబయ్య, బి.నాగేశ్వరరావు, దేవేంద్రరావు, చంద్రశేఖర్‌, యల్లమంద, జి.నరేంద్ర, బి.వెంకటస్వామి, బి.తిరుపతిరావు, ఎల్‌.సూరిబాబు, ఆర్‌.అప్పారావు, ఆర్‌.శ్రీను, ఎన్‌.రాములు, ఆర్‌.కోటయ్య, ఒ.గురవయ్య, వి.బ్రహ్మయ్య, బి.సామీయేలు, సిహెచ్‌.కుటుంబరావు, ఒ.ఆంజనేయులు పాల్గొన్నారు