Jun 22,2021 20:13

ప్రజాశక్తి - భీమడోలు
పాడి రైతులు జగనన్న అమూల్‌ పాల కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ జి.నెహ్రూ బాబు కోరారు. పొలసానిపల్లి గ్రామంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న లైవ్‌ పోరింగ్‌ పథకంలో భాగంగా అమూల్‌ పాల సేకరణ కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. పాల సేకరణ, నాణ్యతా ప్రమాణాలు లెక్కగట్టడం ఇతర అంశాలను పరిశీలించారు. పాడి రైతులతో మమేకమయ్యారు. పాడి పెంపకం, నాణ్యతతో కూడిన పాలు సరఫరా ఇతర అంశాలపై పాడి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాన్ని సందర్శించారు. వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచి షేక్‌ రహీమా బేగం హాసన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి అమూల్‌ పాల కేంద్రం ద్వారా పాల సేకరణ పెంచేందుకు తీసుకొన్న చర్యలను పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుల దృష్టికి తెచ్చారు. పాడి రైతులకు మినరల్‌ మిక్సర్‌ ప్యాకెట్లను పశుసంవర్ధక శాఖ తరపున ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ భీమడోలు సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎ.సుధాకర్‌, మండల పశువైద్యాధికారి డాక్టర్‌ హరికృష్ణ, ఉపసర్పంచి జల్లా బాలకృష్ణ పాల్గొన్నారు.