
ప్రజాశక్తి-బాపట్ల: ప్రతి మహిళ జగనన్న ఆసరాతో ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంతో జిల్లాలో మూడో విడత జగనన్న ఆసరా విడుదల చేయడం జరిగిందని బాపట్ల జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన బాపట్ల వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో జరిగిన మూడో విడత జగనన్న ఆసరా విడుదల కార్యక్రమానికి మోపిదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్ ఆసరా మూడో విడత కింద స్వయం సహాయక సంఘాలకు రూ.238 కోట్ల 31 లక్షలు నగదు విడుదల చేయడం జరిగిందన్నారు. వైఎస్‌ఆర్ ఆసరా పథకం ద్వారా లబ్ధిపొందుతున్న సంఘా మహిళలు ఆ నగదుతో మరింత ఆర్ధికాభివద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ జగనన్న ఆసరాతో పాటు స్త్రీనిధి.. బ్యాంక్ లింకేజ్డ్ పథకాల ద్వారా పెద్దఎత్తున సబ్సిడీతో కూడిన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ అర్జునరావు, బాపట్ల ఎంపీపీ చిన్న పోతుల హరిబాబు, ఏ లక్ష్మణాచారి, డి సురేష్, ఏపిఎంలు జిల్లా స్థాయి డిఆర్డిఏ అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.