
ప్రజాశక్తి-అనకాపల్లి
జగనన్న ఇళ్ల కాలనీ లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.5 లక్షలు చొప్పున మంజూరు చేయాలని, టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు స్వాధీన పరచాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ జగనన్న కాలనీ లబ్ధిదారులకు సెంటు స్థలం, లక్షా 80 వేల రూపాయల చొప్పున మంజూరు చేశారని, ఇది నిర్మాణానికి ఏమాత్రం సరిపోదని తెలిపారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న పేదలకు మారుమూల ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చారని, ఇంటి అద్దె కట్టలేని పరిస్థితుల్లో సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆశతో పేదలు ఉన్నారని తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు మాకిరెడ్డి రామునాయుడు, రాజాన దొరబాబు, జోనల్ కార్యదర్శి వైఎన్ భద్రం, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.సన్యాసిరావు, జి గురుబాబు, అప్పలరాజు, అర్జున్ రావు, కన్నబాబు, దేవుడు బాబు, కోరిబిల్లి శంకర్రావు, ఎన్ సత్యనారాయణ, వై రాజబాబు పాల్గొన్నారు.