Oct 03,2022 22:23

చోరీలకూ పాల్పడుతున్న వైనం - లబోదిబోమంటున్న లబ్ధిదారులు - పోలీసుల నిఘా ఉంచాలని విజ్ఞప్తి
ప్రజాశక్తి - ముదినేపల్లి

             ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జగనన్న లే అవుట్లు నేడు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. ముఖ్యంగా మండలంలోని పలుగ్రామాల్లోని ఈ లే ఆవుట్ల కాలనీల్లో అసాంఘీక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. మండలంలో సూమారు అన్ని గ్రామాల్లో జగనన్న లేవుట్‌ కాలనీల్లో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలున్నాయి. అయితే ఈ కాలనీల్లోకి కొందరు రాత్రి సమయాల్లోకి వచ్చి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు యువతులను తీసుకువచ్చి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అంతేకాక ఈ కాలనీల్లో దొంగతనాలు కూడా జరుగుతున్నట్లు ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు చెబుతున్నారు. అదేవిధంగా మందుబాబులకు కూడా ఈ కాలనీలు అడ్డగా మారాయి. ముదినేపల్లి పంచాయతీ శివారు అన్నవరంలో సుమారు 300 మందికి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలున్నాయి. కొంతకాలంగా ఇక్కడ అసాంఘీక కార్యకలాపాలు, దొంగతనాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల గ్రామస్తులు నిఘా వేసి ముగ్గురు యువకులను, ఇద్దరు యువతులను పట్టుకుని హెచ్చరించి పంపేశారు. స్థానికులు కొందరిని పోలీసులకు అప్పగించారు. అదేవిధంగా ఇటీవల ఈ లే ఆవుట్‌లలో ఆరు నీటి మోటార్లు చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఇక్కడ అసాంఘీక కార్యకలాపాలు, దొంగతనాలు ఆగడంలేదు. పోలీసులు స్పందించి నైట్‌ బీటులో జగనన్న లే ఆవుట్‌ కాలనీల్లో నిఘా వేసి అసాంఘీక కార్యకలాపాలకు చెక్‌ పెట్టాలని జగనన్న కాలనీవాసులు కోరుతున్నారు.