Feb 06,2023 20:18

స్పందనలో కలెక్టర్‌కు వినతులు అందజేస్తున్న రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి-విజయనగరం : తమ సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో పలువురు వినతులు అందజేశారు. ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి 124వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్యధికంగా 79 ఉన్నాయి. పింఛన్ల కోసం, రేషన్‌ కార్డుల జారీ, ఉపాధి కల్పన, ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు ఇతర సమస్యలపై మిగిలిన వినతులు అందాయి. జిల్లా కలెక్టర్‌ ఎ. సూర్యకుమారి, జె.సి మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ గణపతిరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు పద్మావతి, సూర్యనారాయణ, దొర పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ. స్పందన లో అందిన వినతులు పెండింగ్‌ పెట్టకుండా గడువు లోగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.
ఉగాది నాటికి గృహాలు సిద్ధం చేయాలి
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం క్రింద నిర్మిస్తున్న గహాలు ఉగాదికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ లోపల పెండింగ్‌ పనులన్నీ వేగంగా జరగాలన్నారు. రెండో శనివారం సెలవు అయినప్పటికీ హౌసింగ్‌ డే జరపాలని ఆదేశించారు. ప్రత్యేకాధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.