May 28,2023 22:32

జీడి తోటలో పండు నుంచి పిక్కలను వేరు చేస్తున్న జీడి రైతు

- పడిపోయిన జీడి పిక్కల ధరలు
- ధర లేక రైతుల ఆందోళన
- జీడిపప్పు ధర మాత్రం పెరుగుదల
- చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం
- నేడు సచివాలయాల వద్ద జీడి రైతుల నిరసన
ఎక్కడైనా ఉత్పత్తి, ముడిసరుకుల ధరలు పెరిగితే ఆ వస్తువు ధర పెరుగుతుంది. జీడిపిక్కల విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. జీడిపిక్కల ధరలు పడిపోతే, జీడిపప్పు ధర మాత్రం పెరుగుతోంది. వ్యాపారుల మార్కెట్‌ మాయాజాలానికి ఇది నిదర్శనం. ధర లేక, గిట్టుబాట కాక రైతులు ఇంట్లోనే జీడిపిక్కలను నిల్వ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. మరికొందరు రైతులు అవసరాలకు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. పెట్టిన పెట్టుబడులూ రాక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. దీంతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించి, రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జీడి రైతులు సచివాలయాల వద్ద నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ప్రజాశక్తి - పలాస: 
పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, సోంపేట ఉద్దానం ప్రాంతాలతో పాటు జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో జీడి పంట సాగవుతోంది. ఈ పంటే జీవనాధారంగా సుమారు 80 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తిత్లీ తుపాను జీడి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. తుపానుకు ఎక్కడికక్కడ నేలకొరిగిన చెట్లు తొలగించేందుకు పెట్టుబడులు పెట్టగా, మరోవైపు ఉన్న చెట్ల దిగుబడి పూర్తిగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పాడైన చెట్ల స్థానంలో కొత్త జీడి మొక్కలను పెంచుతున్నారు. మూడేళ్లుగా దిగుబడులు తగ్గి తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులకు ఈ ఏడాది జీడి పిక్కల దిగుబడి పెరగడంతో అప్పుల ఊబి నుంచి ఎంతోకొంత గట్టెక్కవచ్చని సంతోషించారు. జీడి పిక్కలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆ ఆనందం వారిలో ఆవిరైంది. ఇటీవలి కాలంలో 80 కేజీల జీడి పిక్కల బస్తా రూ.ఎనిమిది వేలు ఉండగా, జీడిపిక్కలు పంట వచ్చేసరికి ఒక్కసారిగా ఆ ధర 6 వేల నుంచి 7 వేలకు పడిపోయింది. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. గిట్టుబాటు ధర రాకపోగా, మరీ అంత తక్కువ ధరకు అమ్ముకోలేక ఇళ్లల్లోనే జీడి పిక్కల బస్తాలను ఉంచారు. కొందరు రైతులు చేసిన అప్పుల వడ్డీలు కట్టేందుకు, ఇతర కుటుంబ అవసరాలకు తప్పనిసరి పరిస్థితుల్లో బస్తాను రూ.ఐదు వేల నుంచి రూ.ఆరు వేల వరకు తెగనమ్ముకున్నారు. గతేడాది కన్నా ధర పెరుగుతుందని భావిస్తే, అంతకంటే తగ్గడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.తొమ్మిది వేలు మద్దతు ధరతో పాటు ప్రభుత్వం నుంచి అదనంగా రూ.వెయ్యి చెల్లిస్తామని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గతంలో హామీనిచ్చారు. ఆ హామీ నేటికీ నెరవేరకపోగా, ఉన్న ధర కూడా పతనమవుతున్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం
జిల్లాలో పండిన జీడిపిక్కలను కొనుగోలు చేశాకే విదేశీ పిక్కలను దిగుమతి చేసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వ్యాపారులు మాత్రం ఇష్టానుసారంగా విదేశీ జీడిపిక్కలను దిగుమగి చేసుకుని, ఉద్దానంలో పండిన జీడిపిక్కలను తూతూమంత్రంగా కొనుగోలు చేసి రైతులకు ఎంతో కొంత మొత్తాన్ని ముట్టజెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఈ విషయంలో జీడి రైతులు, వ్యాపారులను సమన్వయం చేయాల్సిన పాలకులు, అధికారులు ఆ పని చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పైపెచ్చు వ్యాపారులకే వత్తాసు పలుకుతుండడంతో రైతుల ఇబ్బందుల రెట్టింపు అవుతున్నాయి. జీడిపంట సాగుకు ఎకరాకు సుమారు రూ.20 వేలు పెట్టుబడి పెడుతున్నామని, పెట్టిన పెట్టుబడులూ రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కొనడం కాకుండా రైతుభరోసా కేంద్రాల ద్వారా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకుంటే ఎంతోకొంత ధరకు వ్యాపారులకు విక్రయించడం కంటే పిక్కలను కాల్చి నిరసన తెలిపేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. మండలంలోని మాకనపల్లిలో ఇటీవల సమావేశమైన రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి జీడి పిక్కలకు మద్దతు ధర ప్రకటించి, ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేస్తే రైతులను ఆదుకునే పరిస్థితి ఉంటుంది.
నేడు సచివాలయాల వద్ద ధర్నా
80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించి, రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సచివాలయాల వద్ద సోమవారం ధర్నా చేపడుతున్నట్లు జీడిరైతు సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పలాస కేంద్రంగా జీడి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. జీడి పరిశోధనా కేంద్రాలను ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసి, అభివృద్ధి చేసిన నాణ్యమైన మొక్కలు రైతులకు అందించాలని కోరారు. జీడిపంట విస్తరణకు, జీడితోట పునరుద్ధరణకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరారు.
గిట్టుబాటు ధర కల్పించాలి
జీడి పిక్కలకు గిట్టుబాటు ధర కల్పించాలి. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే జీడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. రైతుల అవసరాలను అదునుగా చేసుకుని వ్యాపారులు ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు.
- కుత్తం వినోద్‌ కుమార్‌, జీడి రైతు, మాకన్నపల్లి
దిగుబడి పెరిగినా ఫలితం లేదు

మూడేళ్లుగా చూసుకుంటే ఈ ఏడాది పంట దిగుబడి పెరిగింది. అయినా ఫలితం లేకుండా పోయింది. గతేడాది కన్నా ధర తగ్గిపోయింది. జీడిపప్పు ధర మాత్రం పెరిగింది. నష్టానికి పిక్కలు అమ్మలేక ఇంటి వద్దే నిల్వ చేసుకుంటున్నాం.
- తామాడ త్రిలోచనరావు, జీడి రైతు, బొడ్డపాడు