May 05,2021 00:53

మాట్లాడుతున్న గనిశెట్టి సత్యనారాయణ

ప్రజాశక్తి - పరవాడ
పంచాయతీ కార్మికులకు బకాయి పడ్డ 13 నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మికుల యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ప్రజల ప్రాణాల కోసం పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు, పంపు ఆపరేటర్లకు, ఎలక్ట్రికల్‌ వర్కర్లకు, ప్లంబర్‌లకు 13 నెలలుగా జీతాలు చెల్లించకపోతే వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. మాస్కులు, శానిటైజర్‌, బూట్లు, యూనిఫారంలు సబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో మరణించిన ప్రదేశాల్లో పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్న సమయంలో మాస్కులు లేకపోతే ఏ రకంగా పనులు నిర్వహించగలరని ప్రశ్నించారు. వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని, పిఎఫ్‌, ఈఎస్‌ఐ, ఐడి కార్డులు, భద్రతా పరికరాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఈవోపిఆర్‌డి పద్మజాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు డి.ఇసాక్‌, జయ, పి పారుపల్లి, ఎస్‌ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.