Jul 29,2021 22:50

నిరసన వ్యక్తం చేస్తున్న ఆరోగ్య సిబ్బంది

ప్రజాశక్తి-కాకినాడ
జిల్లాలోని 22 పిహెచ్‌సిల్లో పని చేస్తున్న సిబ్బందికి ఇవ్వాల్సిన ఐదు నెలల జీతాలు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం డిఎం అండ్‌ హెచ్‌ఒ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.సురేష్‌ బాబు, రాంబాబు, రమేష్‌ మాట్లాడారు. జిల్లాలో 22 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందికి ఐదు నెలల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ గతంలో ధనుష్‌ ఇన్‌ఫోÛటెక్‌ వారికి నోటీసు ఇచ్చినట్టు చెప్పారు. యాజమాన్యం హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఈనెల 17 వ తేదీలోపు వేతన బకాయిలు చెల్లిస్తామని మాట ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌, డిఎం అండ్‌ హెచ్‌ఒ ఇతర అధికారులకు మెయిల్‌ ద్వారా లెటర్‌ కూడా పంపించారన్నారు. ధనుష్‌ ఇన్ఫోటెక్‌ యాజమాన్యం తమకు ముందుగా చెప్పిన విధంగా ఈనెల 17వ తేదీ నాటికి 5 నెలల వేతన బకాయిలు వేయని కారణంగా జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆన్‌లైన్‌ సేవలను నిలుపుదల చేసి నిరసన తెలిపామన్నారు. యాజమాన్యం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కనీసం తమ నిరసనను కూడా పరిగణనలోనికి తీసుకోలేదన్నారు. సిబ్బందికి పూర్తి బకాయి జీతాలు చెల్లించిన తరువాతే నిరసనను విరమిస్తామని స్పష్టం చేశారు.