ప్రజాశక్తి విలేకరులు... పెనుకొండ : జీవో నెంబర్ 7ను సవరించాలని సిఐటియు నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలోని నగరపంచాయతీ కార్యాలయం వద్ద కమిషనర్ వెంకటరాముడుకు నగర పంచాయతీ కార్మికులు సమ్మె నోటీసును అందజేశారు.ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చెయ్యాలని, సమానపనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 7 న జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ సిబ్బందికి వేతనాలు పెంచుతూ జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 7 ను తక్షణమే సవరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న 42 వేలమంది పారిశుధ్య, ఇంజనీరింగ్, ఎన్ఎంఆర్ స్కూల్ స్వీపర్స్ కు 11 వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల పర్మినెంట్ జీవో నెంబర్ 1615 ప్రకారం వేతనాలు, కరువుభత్యం, మధ్యంతరభృతి అమలుచేయాలన్నారు. తాను ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్మికులకు జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశారన్నారు. డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 7జరిగే సమ్మెలో కార్మికులందరూ పాల్గొంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, నగర పంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు గజేంద్ర, చిన్న వెంకటేష్, వెంకటేష్, తిప్పన్న, రిక్షా నర్సింహులు, సూరి, చంద్ర, మణి, లక్ష్మీదేవి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
కదిరి : మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు నాయకులు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కె. ప్రమీలకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 7ను సవరించాలన్నారు. జీవో నెంబర్ 1615 అమలు చేయాలని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ విభాగం, ఎంఎన్ఆర్, స్కూల్ స్వీపర్లకు పదకొండవ పిఆర్సి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 7 నుండి చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పాల్గొంటున్నట్లు చెప్పారు. కార్మికుల హక్కుల సాధనకోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, సిఐటియు నాయకులు జగన్మోహన్, హరినాథ్ రెడ్డి, మున్సిపల్ కార్మికులు తిరుపాలు, బాలకృష్ణ, చెన్నకేశవులు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పెనుకొండలో వినతిపత్రం అందజేస్తున్న నాయకులు