May 31,2023 22:05

రాజగోపాలరావు విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న రామ్మోహన్‌ నాయుడు

- ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
మాజీ ఎంపీ కీర్తిశేషులు బొడ్డేపల్లి రాజగోపాలరావు జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించి, ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన స్థానిక కొత్త రోడ్డు వద్ద రాజగోపాలరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు నిర్మాణ ఆద్యుడు రాజగోపాలరావు అని కొనియాడారు. అయన జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ మాట్లాడుతూ ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన జిల్లా అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన్ను ఒక పార్టీకి చెందిన నాయకునిగా కాకుండా జిల్లా అభివృద్ధి ప్రదాతగా చూడాలన్నారు. శ్రీకాకుళాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయించి కేంద్ర ప్రభుత్వం వద్ద వెనుకబడిన జిల్లాగా గుర్తించి నిధుల మంజూరుకు కృషి చేశారని గుర్తుచేశారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ మాట్లాడుతూ ఆమదాలవలసలో సహకార చక్కెర కర్మాగారం, నైర, రాగోలు, ఆమదాలవలసలో వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయించడంలో రాజగోపాలరావు పాత్ర ఎనలేనిదన్నారు. వ్యవసాయరంగానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండ లకీëదేవి, టిడిపి నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్‌, నాయకులు సింతు సుధాకర్‌, పి.ఎం.జె బాబు, శీర రమణయ్య, చిట్టి మోహన్‌, బలగ చెంగళరావు, ముద్దాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.