Nov 29,2021 23:27

ప్రజాశక్తి-పొదిలి: డిసెంబర్‌ 2, 3 తేదీల్లో మార్కా పురంలో జరిగే సిపిఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌ కోరారు. సోమవారం సిపిఎం పొదిలి ప్రాంతీయ కమిటీ నాలుగో మహాసభలు పట్టణంలోని దర్శి రోడ్డులో కామ్రేడ్‌ కొమరా బాలకృష్ణ నగర్‌ (ఎన్‌జిఓ హోం)లో జరిగాయి. ఈ సందర్బంగా పార్టీ జెండాను సీనియర్‌ నాయకులు, విశ్రాంత ఆర్టీసి ఉద్యోగి పి.ఛార్లెస్‌ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపక నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్‌ తవనం చెంచయ్య, కామ్రెడ్‌ కొమరా బాలకృష్ణ చిత్రపటాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పిం చారు. అనంతరం కామ్రెడ్‌ ఏ.శ్రీనివాసులు అధ్యక్షతన ప్రారంభమైన మహాసభలో మృతవీరులకు పి.బాలనరసయ్య సంతాప తీర్మానం ప్రవేశపెట్టి.. నివాళులర్పించారు. అనంతరం సయ్యద్‌ హనీఫ్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఇటీవల భయబాంత్రులకు గురి చేసిన కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవ డంలో సోషలిస్టు దేశాలు ముందున్నాయ న్నారు. ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా ఉన్న క్యూబా మహమ్మారిని నిలువరించడంలోనూ, ఇతర దేశాలకు వైద్యసహాయం చేయడంలోనూ ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడ విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండటం వల్లనే అన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలలో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అన్ని రంగాలూ ప్రైవేటు రంగంలో ఉన్నాయన్నారు. దీంతో నిన్నటి కరోనాతో ఆర్థిక సంక్షోభంలో పడిందన్నారు. దీంతో పాటు ప్రపంచదేశాలు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడ్డాయన్నారు. ఒక పెద్ద సంక్షోభం వెనక మరోక పెద్ద సంక్షోభం రావడం సహజమని కమ్యూనిస్టు సిద్ధాంతం చెబుతోందన్నారు. ప్రణాళికా బద్దంగా, శాస్త్ర సాంకేతిక రంగాలలో అగ్రగామిగా ముందుకు పోతున్న చైనాను నిలవరించేందుకు అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు కుటిలయత్నాలు చేస్తున్నాయన్నారు. ఇంతటి ప్రపంచ సంక్షోభ సమయంలో కూడా దేశంలో ఆర్థిక వ్యవస్ధకు వెన్నెముకలా ఉన్న వ్యవసాయం భారతదేశాన్ని ఆదుకుంటుందన్నారు. మొన్నటి నాలుగు రాష్ట్రాల ఎన్నికలు, నిన్నటి ఉప ఎన్నికల్లో బిజెపి పరాభవంతోనే నల్లచట్టాలను రద్దు చేస్తున్నట్లు నాటకం ఆడుతూ ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలకు ఆర్థిక భారాలు పెరుగుతున్నాయని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గాలి వెంకట రామిరెడ్డి, పొదిలి ప్రాంతీయ కమిటీ కార్యదర్శి ఎం.రమేష్‌, పి.బాలనరసయ్య, నర్రా వెంకటేశ్వరరెడ్డి, పి.నరసింహారావు, పి.ఛార్లెస్‌, గంధం నరసింహారావు, కె.నరసింహర, షమ్మీ పాల్గొన్నారు.