Mar 19,2023 22:41

లావేరులో మొక్కజొన్నను పరదాలు తో కప్పిన చిత్రం

ప్రజాశక్తి - విలేకరుల యంత్రాంగం: అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురిసాయి. ఉరుములు, మెరుపులతోపాటు, పలు చోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు టెక్కలిలో మండలం దీపావళిలో 78 గొర్రెలు, మేక పిల్లలు మృతి చెందాయి. బలగలోని భద్రమ్మ కోవెలపై పిడుగు పాడటంతో గోడలు బీటలు వారాయి. లావేరు మండలంలో రోడ్డుపై ఎండబెట్టిన మొక్కజొన్న తడిచిపోయింది. జిల్లాలో అత్యధికంగా మెళియాపుట్టిలో 72.2 మి||మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా ఇచ్ఛాపురంలో 5.4 మి||మీ వర్షపాతం నమోదైంది. టెక్కలిలో 55.4 మి||మీ, హిరమండలంలో 52.5మి||మీ, పాతపట్నంలో 51.6మి||మీ నమోదు అయ్యాయి.
మొక్కజొన్నకు నష్టం
లావేరు మండలంలో 7వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. సుమారు 60శాతం పంట రైతుల కోత కోశారు. రోడ్డు పక్కన మొక్కజొన్నను రైతులు ఎండబెట్టారు. రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు పంటను టార్ఫాలిన్‌తో కప్పారు. అయినా పంట తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న బూజుపట్టి, మొలకలు వస్తే వ్యాపారులు కొనుగోలు చేయరని వాపోతున్నారు. పంటను ఎండ బెట్టే ప్రయత్నంలో నిమగమయ్యారు.
నేలకూలిన ట్రాన్స్‌ఫార్మర్‌, విద్యుత్‌ స్తంభం
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాశీబుగ్గ హిరావత్‌ దుకాణం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, సమీపంలోని విద్యుత్‌ స్తంభం నేలకూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం కారణంగా రోడ్లు, కాలువ నిర్మాణ పనుల వల్ల మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. మండలంలోని చినంచల, పెదంచల గ్రామాల్లో రైతులు నూర్పులు చేసి ధాన్యం బస్తాలను పంట పొలాల్లో ఉంచడంతో ధాన్యం బస్తాలు వర్షపు నీటిలో తడిచిపోయాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
భద్రమ్మగుడిపై పిడుగు
శ్రీకాకుళం నగరంలోని బలగలోని భద్రమ్మతల్లి ఆలయంపై ఆదివారం వేకువఝామున పిడుగు పడింది. దీంతో ఆలయ గోడలకు బీటలు వారాయి, గుడిపై అమర్చిన విగ్రహాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మాదారపు వెంకటేష్‌, సింహాద్రినాయుడు, పాపారావు, తదితరులు ఆలయానికి వెళ్లి పరిశీలించారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
వజ్రపుకొత్తూరు మండలం పూండిలో ఇటీవల సిసి రోడ్డు నిర్మించారు. రహదారి ఎత్తు పెరగడంతో సమీపంలోని అయ్యంగారి బేకరీ, జేసన్‌ మొబైల్‌ షాపుల్లోకి వర్షపు, మురుగునీరు చేరింది.