Jun 11,2021 00:37

మాట్లాడుతున్న కలెక్టర్‌ వినరుచంద్‌

ప్రజాశక్తి-కలెక్టరేట్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల నిర్మాణంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి సంబంధిత అధికారులంతా పట్టుదలతో పని చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.వినరుచంద్‌ ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్‌ సమావేశమందిరంలో జగనన్న కాలనీలు కార్యక్రమం అమలపై గహనిర్మాణ శాఖ ఇంజనీరింగు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి దశలో జిల్లాకు 52,050 ఇళ్లు మంజూరైనాయని, ఇందులో 501లే అవుట్లలో, 27,787 ఇళ్లు నిర్మించనున్నట్టు, 9,145 ఇళ్లు లబ్దిదారుల సొంత స్థలాలలో నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక డ్రైవ్‌ కింద 5వేల ఇళ్ల నిర్మాణం గ్రౌండింగ్‌ చేసినట్టు పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా 5వేల ఇళ్లను ఫుటింగ్‌ స్థాయికి తీసుకురావాలన్నారు. డివిజన్‌ స్థాయిలో ఆర్‌డిఓలు నాయకత్వం వహించాలని, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లతో సమన్వయం చేసుకొని ఇసుక, ఇటుకలు, గోదాములు, స్థలాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. అన్ని లేఅవుట్‌లలో ఈ నెల 15లోగా విద్యుత్‌ కనెక్షన్లను ఇవ్వాలని ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇని కోరారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్‌ జి జృజన, జెసిలు పి అరుణ్‌ బాబు, కల్పనా కుమారి, హౌసింగ్‌ పిడి శ్రీనివాస్‌, ఆర్‌డిఓలు పెంచల కిషోర్‌, జె సీతారామరావు, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యుఎస్‌, ఇపిడిసిఎల్‌, పబ్లిక్‌ హెల్త్‌ శాఖల అధికారులు, హౌసింగ్‌ శాఖ ఇఇలు, డిఇలు, ఎఇలు పాల్గొన్నారు.