May 16,2022 23:43

చిత్ర పటాలను చూపుతున్న చిన్నారులు

ప్రజాశక్తి-అరకులోయరూరల్‌:గిరిబాలలకు చిన్నతనం నుంచి మంచి అలవాట్లు, నడవడిక, విజ్ఞానం, వినోదం దిశగా నడిపించేందుకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తామని గిరి బాల నేస్తం జిల్లా కన్వీనర్‌ వివి జయ తెలిపారు. సోమవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ఆసరా చారిటబుల్‌ సొసైటీ (విశాఖపట్నం) సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 40 గ్రామాల్లో గత వారం రోజుల నుంచి ఈ క్యాంపులు జరుగుతున్నాయని, వీటిపై శిక్షణ పొందిన వాలంటీర్లతో విద్యార్థులకు ప్రతిరోజు రెండు గంటల పాటు వివిధ అంశాలపై పిల్లలకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలోని అరకులోయ, అనంతగిరి, హుకుంపేట, పెదబయలు మండలాల్లో ఈ క్యాంపులు జరుగు తున్నాయన్నారు. పేపర్‌లతో బొమ్మలు తయారు చేయడంతో పాటు డ్రాయింగ్‌, టీం గేమ్స్‌, పోస్టర్‌ డిజైన్‌, కథలు, కవిత్వాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంప్‌ నిర్వహణ కన్వీనర్‌ ఎస్‌.నరేంద్ర, కౌసల్య, బాలరాజు, ఆనంద కుమారి, నాగలక్ష్మి, సంధ్య పాల్గొన్నారు.