May 23,2021 14:42

అనగనగా ఒక అడవిలో జంతువులన్నీ ప్రశాంతంగా జీవిస్తుండేవి. అలా కొద్ది రోజుల గడిచిన తర్వాత, అడవిలోకి భారీ శరీరం గల ఒక వింత జంతువు ప్రవేశించింది. దాన్ని చూసి సింహాలు, పులులు, ఏనుగులు, కూడా భయపడసాగాయి. కనబడిన ప్రతి జంతువునూ, క్రూరంగా చంపి తినేది. దాని రాకతో అడవిలో జంతువులు రాత్రిపూట కూడా సరిగా నిద్రపోయేవి కాదు. ఎప్పుడు ఎక్కడ ఏ జంతువుపై విరుచుకు పడుతుందో తెలియక, జంతువులన్నీ వణికిపోయేవి. ఇప్పటికే చాలా జంతువులను తినేసింది.
   ఒకరోజు జింక తన బిడ్డకు పాలిస్తూ ఒక చెట్టుకింద నిలబడింది. ఆ జంతువు జింకను చూసింది. తినడానికి వచ్చింది, అది గమనించిన జింక ధైర్యం చేసి ''నువ్వు నన్ను తినడానికి వస్తున్నావని నాకు తెలుసు. బిడ్డకు పాలిచ్చిన తర్వాత నన్ను తినేరు'' అంది. ''నేను ఇప్పటికే రెండు అడవి దున్నలను తిన్నాను, పెద్దగా ఆకలి లేదు, ఈ పూటకు నీ బిడ్డనిస్తే తిని హాయిగా పడుకుంటాను'' అని ఆ జంతువు అనగానే, జింక బాధతో... భయంతో లోలోపల మదనపడింది. ''అయ్యో.. అలాగా.. నా బిడ్డ బాగా ఆకలితో వుంది. దాని ఆకలి తీరకముందే చంపేస్తే, అది నీకు మంచిది కాదు, కోరిక తీరకుండానే చనిపోతే నా బిడ్డ ఆత్మ శాంతించదు, అందుకని కడుపునిండా పాలు తాగినాక, తీరిగ్గా తినేద్దువుగాని'' అంది జింక.
   అరగంట సమయం గడిపేసింది. జింకపిల్ల పాలు తాగుతున్నట్టు నటిస్తోంది. ''ఇంకా ఎంతసేపు. నా ఆకలి రెట్టింపు అయిందో నిన్ను, నీ బిడ్డని ఇద్దర్నీ తినేస్తాను'' అంటూ హెచ్చరించింది ఆ జంతువు. ''అవును, ఆకలి అనేది ఎంత పనైనా చేయిస్తుంది, ఎంతదూరమైనా నడిపిస్తుంది, ఆకలి విలువ నాకు తెలుసు'' అంది జింక. ''మరైతే ఆలస్యం దేనికి, త్వరగా నీ బిడ్డను ఇవ్వు'' అని గర్జించింది ఆ జంతువు. ''ఇస్తాను, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది భరించలేకపోతున్నాను, అసలు ఆకలి అన్నదే కాకుండా ఒక ఆకు ఉందంట, అది తింటే ఎప్పటికీ ఆకలి కాదంట, వెయ్యి ఏనుగుల బలం వస్తుందని, ఒక వైద్యుడు చెబితే విన్నాను. ఆ ఆకు తినడానికి వెళుతుంటే మధ్యలో నా బిడ్డ పాలు కోసం ఏడ్చింది, ఇక్కడ ఆగి నీ చేతికి దొరికిపోయాను'' అంది జింక.
   ''ఓహో అలాగా. అది తింటే ఆకలి ఉండదా.. భలే భలే.. వెయ్యి ఏనుగుల బలం వస్తుందా.. ఇదేదో చాలా బాగుంది. అయితే నేను కూడా తినాలి వెళదాం పద'' అని తొందర పెట్టింది ఆ జంతువు. ''సరే పదా'' అంటూ జింక ముందు వెళుతుంటే ఆ జంతువు వెనుక నడిచింది.
   చాలా దూరం వెళ్ళిన తర్వాత, ఒక పెద్ద బావి గడ్డపైన, గుబురు చెట్ల దగ్గరకు తీసుకెళ్ళింది. ''అక్కడ కనిపిస్తున్న చెట్టు ఆకులు తింటే, ఎప్పటికీ ఆకలి కాదు'' అంది జింక. ''ఆ చెట్టు బావి లోకి సగం వంగింది. ఆకులు అందవు'' అంది జంతువు. ''నువ్వు బాగా లావుగా, బలంగా, పొడవుగా ఉన్నావు కాబట్టి, ఒక అడుగు ముందుకు వేస్తే అందుతాయి'' అనగానే జంతువు ఒక అడుగు ముందుకు వేసింది, కాలుజారి చాలా లోతైన, ఇరుకైన, బావిలోకి పడిపోయింది ఆ జంతువు. జింక గట్టిగా నవ్వింది. ''శరీరం పెంచుకుంటే కాదు, బుద్ధి పెంచుకోవాలి. ఇన్నాళ్లూ జంతువులను వేటాడి, హింసించి తిన్నావు. ఇక ఎప్పటికీ నువ్వు బయటికి రాలేవు, ఆకలితో అలమటించి చస్తావు.'' అంటూ తన బిడ్డను తీసుకుని వెళ్ళి పోయింది జింక. జింక ఉపాయానికి అడవిలో జంతువులన్నీ మెచ్చుకున్నాయి. ఆ రోజు నుంచి స్వేచ్ఛగా జీవించాయి.
 

- నరెద్దుల రాజారెడ్డి
96660 16636