Jul 28,2021 22:16

ధర్నా నిర్వహిస్తున్న జిఒ3 సాధన కమిటీ నాయకులు

ప్రజాశక్తి - రంపచోడవరం
జిఒ 3ను అమలు చేయాలంటూ రంపచోడవరం ఐటిడిఎ వద్ద జిఒ3 సాధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సాధన కమిటీ రాష్ట్ర కార్యదర్శి లోతా రామారావు మాట్లాడారు. షెడ్యూల్‌ ఏరియాలో గిరిజనులకు నూరు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, జిఒ 3ని పునరుద్దరించి చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 244 ను అనుసరించి 5వ షెడ్యూల్‌ ద్వారా గిరిజన ప్రాంతంలో స్థానిక ఆదివాసులకు ప్రత్యేక హోదా కల్పించారన్నారు. ఆదివాసీల రక్షణ, అభివద్ధి నిమిత్తం 100 శాతం రిజర్వేషన్‌ అమలుకు గవర్నర్‌ 5వ షెడ్యూల్‌ క్లాజ్‌ 1 ప్రకారం జిఒ 3 జారీ చేశారన్నారు. ఆదివాసీలు పొందుతున్న 3 శాతం రిజర్వేషన్‌ సుప్రీంకోర్డు రద్దు చేసిందన్నారు. ఆదివాసీ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లారన్నారు. కోర్ట్‌లో కేసు పెండింగ్‌ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్‌ వర్తింప జేస్తూ మెమో జారీ చేయడం సరికాదన్నారు. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. 2018 డిఎస్‌సి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జిఒ 3 ప్రకారం జూన్‌ 16న పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉందన్నారు. జిఒ 3 2020లో రద్దయ్యిందని, దీన్ని సాకుగా చూపి వారికి ఇంకా పోస్టింగులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. వెంటనే వారికి పోస్టింగులు ఇవ్వాలన్నారు. అనంతరం పిఒకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వేటుకూరు, చికిలింత, కొండపల్లి సర్పంచులు ఈతపల్లి మల్లీశ్వరి, కె.సూరిబాబు, కుంజం జగన్నాథం, గిరిజన సంఘం నాయకులు టి.శ్రీనివాస్‌, ఇ.సిరిమల్లిరెడ్డి, ఎం.వాణిశ్రీ, కె.చెల్లయమ్మ. తదితరులు పాల్గొన్నారు..