Sep 13,2021 20:09

యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ ఓటమిపాలవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ ఏడాది 'క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌' సాధించి చరిత్ర సృష్టించాలని కలలు కన్న అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఒక దశలో తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. మెద్వెదేవ్‌తో ఓటమిపాలయ్యాక తన రాకెట్‌ను నేలకేసి కొట్టి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌లో విజేతగా నిలిచిన జకోవిచ్‌.. ఒలింపిక్స్‌లో ఓటమితో గోల్డెన్‌ గ్రాండ్‌స్లామ్‌ ఆశలు గల్లంతయ్యాయి. యుఎస్‌ ఓపెన్‌లోనైనా గెలుపొంది 'క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌' సాధిస్తాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కాగా, జకోవిచ్‌ ఇప్పటివరకు అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రోజర్‌ ఫెదరర్‌, నాదల్‌ సరసన నిలిచాడు.