Jan 14,2022 21:15

మెల్‌బోర్న్‌: టాప్‌సీడ్‌ నోవాక్‌ జకోవిచ్‌కు మరో షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా అతడి వీసాను మరోసారి రద్దు చేసింది. దీంతో మూడేళ్లు అతడు మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టేందుకు అవకాశం రాకపోవచ్చు. ఈ మేరకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ మంత్రి అలెక్స్‌ హాకే ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజల ఆరోగ్య భద్రత నేపథ్యంలోనే జకోవిచ్‌ వీసాను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జకోవిచ్‌ ఈనెల 5న మెల్‌బోర్న్‌కు చేరుకోగా అతడి వద్ద వాక్సినేషన్‌కు ధ్రువపత్రాలు లేవు. దీంతో ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే జకోవిచ్‌ వీసాను రద్దు చేసి అతడిని ఇమ్మిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు. దీంతో జకోవిచ్‌ కోర్టుకెక్కాడు. అనంతరం ఫెడరల్‌ కోర్టు జకోవిచ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అతడి వీసాను వెంటనే పునరుద్ధరించాలని, అతడిని డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. ఆ తీర్పు వెలువెడిన కొద్ది గంటల్లోనే తిరిగి ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. తాజాగా ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి మరోసారి వీసా రద్దు చేయడం గమనార్హం.