Jul 26,2021 06:45
  • కేంద్రం నుంచి రావాల్సింది రూ.620 కోట్లు
  • కొన్నిచోట్ల పనులు నిలిపివేత

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : జల్‌జీవన్‌ మిషన్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకానికి నిధుల కొరత ఏర్పడింది. ప్రతిపాదిత పనులకు మొత్తం నిధుల్లో గ్రామ పంచాయతీలు పది శాతం సమకూర్చితే మిగిలిన 90 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలన్న నిబంధన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10,409 కోట్లతో 32,351 పనులు ప్రతిపాదించారు. 56.30 లక్షల కుళాయిలు ఏర్పాటుకు నిర్ణయించారు. రూ.5 లక్షలు కంటే తక్కువ అంచనాతో కూడిన పనులను నామినేషన్‌ పద్ధతిలో చిన్న కాంట్రాక్టర్లకు అప్పగించారు. చేసిన పనులకు బిల్లులు అప్‌లోడ్‌ చేయడంతో ఈ ఏడాది మార్చి వరకూ సుమారు రూ.120 కోట్లు విడుదలయ్యాయి. దీంతో కాంట్రాక్టర్లు ఉత్సాహంగా మిగిలిన పనులు చేప ట్టారు. అయితే మార్చి తరువాత బిల్లులు విడుదల కాలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. సుమారు రూ.281 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
     రాష్ట్రంలో 17,494 గ్రామాల్లో 56.30 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాది 6,701 గ్రామాల్లో వందశాతం కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని 32.12 లక్షల ఇళ్లను గుర్తించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,689.98 కోట్లు కేటాయించింది. వీటిలో ఆర్‌డబ్ల్యుఎస్‌ వాటా రూ.276.76 కోట్లు, జల్‌జీవన్‌ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1067.24 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.1,312.50 కోట్లు, ఉపాధి హామీ అనుసంధానం చేయడం ద్వారా రూ.700 కోట్లు, స్వచ్ఛభారత్‌ నిధులు రూ.543 కోట్లు, జల్‌జీవన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.790.48 కోట్లు కేటాయించింది. పథకం అమల్లో భాగంగా కేంద్రం వాటా రూ.2,033 కోట్లకు గాను ఇప్పటి వరకూ అయిన పనులకు రూ.900 కోట్లు కేటాయించాల్సి ఉన్నా... కేవలం రూ.280 కోట్లే విడుదల చేసింది. ఈ నిధులు మార్చి వరకూ జరిగిన పనులకు సర్దుబాటు చేసినా ఇంకా రూ.281 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
 

                                                రూ.5 లక్షల దాటిన పనులకు వెనకడుగు

   ఈ ఏడాది రూ.5 లక్షల్లోపు పనులు చేసిన కాంట్రాక్టర్లకే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అంతే విలువ గల పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయినప్పటికీ పనులు ప్రారంభించలేదు. దీంతో తిరిగి టెండర్ల నుంచి తప్పుకుందామన్న ఆలోచనలో బడా కాంట్రాక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. టెండర్లు ఖరారైతే పని విలువలో ఒక శాతం ఇఎమ్‌డి చెల్లించాలి. బిల్లులు రాకపోతే ఇరుక్కుపోతామని కొంతమంది టెండర్ల నుంచి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పనులు పూర్తి చేయాలన్న ఉద్దేశంతో సిమెంటు, పైపులు, ఇసుక, ఇతర సమగ్రి ధరలు పెరిగినా... అప్పులు చేసి కొంత మంది కాంట్రాక్టర్లు పనులు చేసే మేస్త్రిలకు, కూలీలకు డబ్బులు చెల్లించారు. పనులు పూర్తి చేసి నాలుగైదు నెలలు కావస్తున్నా ఇంకా బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టరు వాపోయారు.