Nov 24,2022 17:04

న్యూఢిల్లీ  :    ఢిల్లీలోని జామా మసీదు   ఒంటరి మహిళలు, బాలికల ప్రవేశంపై నిషేధం విధించింది.  బాలికలు, మహిళలు ఒంటరిగా కానీ గుంపుగా కానీ మసీదులోకి ప్రవేశించడంపై నిషేధం విధిస్తున్నట్లు గురువారం మసీదు గేట్లకు  నోటీసులు అంటించారు. ఒకవేళ మసీదులోకి ప్రవేశించాలంటే వారి కుటుంబంలోని పురుషుడు తప్పని సరి అని పేర్కొన్నారు. కొంతమంది అమ్మాయిలు, మహిళలు ఒంటరిగా వచ్చి వేరే వారి కోసం ఎదురుచూస్తున్నారని.. ఇది అందుకు ఉద్ధేశించింది కాదని జామా మసీదు పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ సబివుల్లా ఖాన్‌ పేర్కొన్నారు.

మీటింగ్‌ పాయింట్‌గా, టిక్‌టాక్‌ వీడియోలు చేసేందుకు, డ్యాన్సుల కోసం వినియోగించడం సరికాదని పేర్కొన్నారు. మసీదు, దేవాలయం, గురుద్వారా ఏదైనా ప్రార్థన స్థలం నిజంగా ప్రార్థనల కోసం వచ్చే మహిళలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆయన స్పష్టం చేశారు. నమాజ్‌ చేయడానికి వచ్చే వ్యక్తులకు భంగం కలిగించే విధంగా మహిళలు టిక్‌ టాక్‌ వీడియోలు షూట్‌ చేయడం, డాన్సులు వేయడం, మీటింగ్‌ పాయింట్‌గా వినియోగించడాన్ని నిషేధిస్తున్నామని అన్నారు. కుటుంబం, భర్తతో వచ్చే మహిళలపై ఎలాంటి ఆంక్షలు లేవని అన్నారు.   

ఈ నిషేధంపై మహిళా కమిషన్‌ చీఫ్‌ (సిడబ్ల్యుసి) స్వాతి మలివాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది మహిళల హక్కులను ఉల్లంఘించడమేనని  మండిపడ్డారు. దీనిపై నోటీసులు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. పురుషుడు ప్రార్థన చేయడానికి ఎన్ని హక్కులు ఉంటాయో.. మహిళలకు కూడా అవే హక్కులు ఉంటాయని, మహిళల ప్రవేశాన్ని నిషేధించే హక్కు ఎవరికీ లేదని  ఆమె    ట్విటర్ లో  పేర్కొన్నారు.