Jul 28,2021 22:16

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన లఢక్‌, కాశ్మీర్‌లను మళ్లీ కలిపి రాష్ట్ర హోదా కల్పిస్తామని,అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఇందుకు సంబంధించిన ప్రకటన చేస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో బుధవారం హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2019 ఆగస్ట్‌ 5న జమ్మూకాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370, 35ఏ అధికరణలను కొట్టివేశారు. వాటిని రాజ్యాంగం నుంచి తొలగించి జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన విషయం తెలిసిందే. బిజెడి ఎంపి సస్మిత్‌ పాత్ర జమ్మూకశ్మీర్‌లో భద్రతా చర్యలపై ప్రశ్న వేశారు. రెండు ప్రశ్నలకు కలిపి సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. 2020లో 59 శాతం ఉంటే జూన్‌ 2021 వరకు 32 శాతానికి తగ్గిపోయిందని వెల్లడించారు. లోయలో కాశ్మీరీ పండితుల పునరావాసం.. భద్రతపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 900 కశ్మీరీ పండిత్‌, డోగ్రా హిందూ కుటుంబాలు కాశ్మీర్‌లో ఉన్నాయని వెల్లడించారు.