May 31,2023 22:03

నిరసన దీక్షలో మాట్లాడుతున్న టిడిపి నాయకులు ద్వారపురెడ్డి జగదీష్‌

ప్రజాశక్తి - బలిజిపేట : అధికార వైసిపి నాయకుల దాడులకు నిరసనగా స్థానిక బస్టాండ్‌ వద్ద బుధవారం జనసేన నాయకులు చేపట్టిన నిరసన దీక్షకు టిడిపి రాష్ట్ర అధికారి ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, సిపిఎం నాయకులు యమ్మల మన్మధరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ద్వారపురెడ్డి జగదీష్‌ మాట్లాడుతూ బర్లిలో స్థానిక సమస్యలపై ప్రశ్నించిన జనసేన నాయకులు బంకురు పోలినాయుడు, గంట్యాడ స్వామినాయుడులపై వైసిపి నాయకులు భౌతికదారులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమమన్నారు. ఇలా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్య విలువలు మట్టిలో కలిసిపోతాయని హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే వాటిని పరిష్కరించాల్సింది పోగా అడిగిన జనసేన నాయకులపై దాడులకు ప్రేరేపించడం ఇటు ప్రజాస్వామ్యానికి, అటు నాయకత్వానికి మాయని మచ్చగా ఉంటుందని అన్నారు. భౌతికంగా దాడి చేయడమే కాకుండా పోలినాయుడు కుటుంబీలను భయాందోళనకు గురిచేసేలా హెచ్చరించడం పద్ధతి కాదని అన్నారు. ఇలాంటి సంఘటనలు మరలా జరిగితే ప్రతిఘటనలు చూపించాల్సిన ఉంటుందన్నారు. ఎమ్మెల్యే అహంకారాన్ని వీడి ప్రవర్తించాలన్నారు. పోలీసులు కూడా పార్వతీపురంలో ప్రతిపక్ష నాయకుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సమయంలో ఫిర్యాదు చేస్తే నేటికీ దానిపై స్పందించలేదన్నారు. పోలీసు ఉద్యోగాలు శాశ్వతమైనవని, రాజకీయ నాయకులు వచ్చి పోయే వారిని ఆలోచన చేసి విధి నిర్వహణలో మెలగాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ భౌతిక దాడులకు పాల్పడిన వారిపై క్షేత్రస్థాయి దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సిపిఎం నాయకులు మన్మధరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను పాతిపెట్టేలా బాధ్యతలో ఉన్న ఎమ్మెల్యే సమక్షంలో ఇటువంటి చర్యలు జరగడం బాధాకరమని అన్నారు. వెంటనే ఈ విషయంలో క్షేత్రస్థాయి దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసువాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.