Oct 17,2020 08:44

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. కరోనా బారిన నుండి బయటపడిన అధ్యక్షుడు..రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఇటు డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రంగంలోకి దిగనున్నారు. వచ్చేవారం పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ఒబామా పాల్గనున్నారని బిడెన్‌ ప్రచార విభాగం తెలిపింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు జో బిడెన్‌, కమలా హారీస్‌ కోసం ఆన్‌లైన్‌ ప్రచారం చేసేందుకు ఒబామా అంగీకారం తెలుపగా.. ఆయన వ్యక్తిగతంగా ప్రచారం చేయడం ఇదే తొలిసారి. ఒబామా అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో బిడెన్‌ ఉపాధ్యక్షుడిగా వ్యహరించిన సంగతి తెలిసిందే. జో బిడెన్‌, కమలా హారీస్‌ తరుపున ప్రచారం చేసేందుకు వచ్చే బుధవారం( అక్టోబర్‌ 21) మాజీ అధ్యక్షడు ఒబామా ..పెన్సిల్వేనియాలోని ఫిలదెల్పియాకు వెళతారని ఎన్నికల ప్రచారం విభాగం ప్రకటించింది. అధ్యక్ష పదవి నుండి వైదొలిగి నాలుగేళ్లు గడుస్తున్నా..ఒబామా పట్ల అమెరికా ప్రజల్లో ఉన్న సానుకూల వైఖరిని వినియోగించుకుని ఓట్లు రాబట్టుకోవాలని డెమొక్రటిక్‌ పార్టీ చూస్తోంది.