
సంక్రాంతి సందళ్లు తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు తలమానికం. రాను రాను సంప్రదాయం ముసుగులో విచ్చలవిడి జూదం ప్రవేశించి తెలుగు లోగిళ్లను కలుషితం చేయడం క్షమించరానిది. కోవిడ్ థర్డ్్ వేవ్ విజృంభణ వేళ పండగ మూడు రోజులూ గ్రామం పట్టణం అనే తేడా లేకుండా కోడి పందేలు, వాటి కేంద్రంగా యథేచ్ఛగా సాగిన జూద క్రీడను ప్రసార, సామాజిక మాధ్యమాల్లో లైవ్‌లో వీక్షించిన జనం ముక్కుమీద వేలేసుకున్నారు. ఇసుకేస్తే రాలనంతగా బైక్‌లు, కార్లు, ఆటోలలో పందెం రాయుళ్లు జిల్లాలు, రాష్ట్రాలు దాటుకొని జూదంలో పాల్గొన్నా అడ్డుకునే వారెవరూ లేరు. ఉభయగోదావరి, కృష్ణా, మరికొన్ని ప్రాంతాల్లో జోరుగా నిర్వహించిన కోడి పందేలు, వాటి చుట్టూ సాగించిన చీట్లపేక, గుండాట వంటి అనేకానేక రకాల జూదాల్లో రూ. వందల కోట్లు చేతులు మారిన తీరు మాఫియాను తలదన్నింది. మద్యం ఏరులై పారింది. బైక్‌లు, కార్లు, బంగారు, వెండి ఆభరణాల ఆఫర్లు 'బిగ్‌బాస్' షోను మించిపోయాయి. అసాంఘిక కార్యకలాపాలకు కోడి పందేలు వేదికయ్యాయి. గుడివాడలో క్యాసినో తరహా క్లబ్, అశ్లీల నృత్యాలు హైలైట్. క్లబ్ ఎంట్రన్స్ ఫీజు రూ.10 వేలు. ఇలాంటివి ఇంకా రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. కోడి పందేల్లో ఆధునికత బయలుదేరింది. రెయిన్‌ప్రూఫ్ టెంట్లు, రాత్రిళ్లు పందేల కోసం ఫ్లడ్ లైట్లు, డిజె సౌండ్స్, ఎల్ఇడి స్క్రీన్లు, డ్రోన్లతో చిత్రీకరణ, సెల్ఫోన్లకు షేరింగ్‌లు, పేటిఎం ద్వారా పేమెంట్లు పుట్టుకొచ్చాయి. ఆన్లైన్లో పందెం కోళ్లకు శిక్షణలు, వాట్సాప్ గ్రూపుల్లో కోళ్ల అమ్మకం, లైవ్‌లో బెట్టింగ్‌ల వంటి హంగులు కోడి పందేలకు సంతరించుకున్నాయి. ఇది నయా-ఉదారవాద ట్రెండ్‌సెట్.
చట్ట విరుద్ధ కార్యకలాపాలు బహిరంగంగా జరుగుతున్నా అధికార యంత్రాంగం చేతులు కట్టుక్కూర్చున్న వైనంతో ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉన్నాయనే భావించాలి. సకల సదుపాయాలతో నిర్వహించిన కోడి పందేలకు తిరునాళ్లు, జాతర్లకు మాదిరి పందెం రాయుళ్లు పోటెత్తడం అధికార యంత్రాంగం సహాయ సహకారాలు లేకుండా జరగదు. కోవిడ్ నిబంధనలు గాలికి కొట్టుకు పోయాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులే పందేలకు సై అన్నారంటే పందెం రాయుళ్లు ఊరుకుంటారా? ఒకటికి రెండింతలు రెచ్చిపోయారు. పండగ చేసుకోవాల్సిన వాళ్లు చేతిలోని డబ్బు దస్కం పోగొట్టుకొని వళ్లు ఇళ్లు గుల్ల చేసుకున్నారు. ఈ దారుణాలకు ముమ్మాటికీ ప్రభుత్వానిదే బాధ్యత. కోడి పందేలను నిషేధిస్తూ 2017లో హైకోర్టు సవివరమైన తీర్పు చెప్పింది. కానీ ఆ తీర్పును ప్రభుత్వాలు అమలు పరచట్లేదు. దాంతో ప్రతి ఏడాదీ న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పడుతున్నాయి. మొన్న పడిన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా కోడి పందేల నిర్వహణను అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందని ప్రభుత్వం తరఫున హోం శాఖ కార్యదర్శి కోర్టుకు హామీ ఇచ్చారు. కోర్టుకు ఇచ్చిన ఆ హామీని ప్రభుత్వం ఉల్లంఘించిందనడానికి సంక్రాంతి మూడు రోజుల్లో అడ్డు అదుపు లేకుండా సాగిన కోడి పందేలు, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలే తిరుగులేని సాక్ష్యాలు. హైకోర్టు సూమోటోగా ఈ వ్యవహారాన్ని విచారణకు స్వీకరించాలి.
నయా-ఉదారవాద సంస్కరణలొచ్చి మన సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేస్తున్నాయి. సంస్కృతి సంప్రదాయాలంటే ఒకానొక ప్రదేశంలోని ప్రజల జీవన విధానం. ఆ వారసత్వాన్ని ప్రజలే కాపాడుకోవాలి. నయా-ఉదారవాద విధానం సంప్రదాయాలను వ్యాపార, లాభదాయక సరుకులుగా మార్చేసింది. ఈ క్రమంలోనే వినోదాత్మకంగా సాగాల్సిన గ్రామీణ క్రీడలు కొంతమందికి డబ్బు సంపాదించిపెట్టే సాధనాలుగా మారిపోయాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న 'లక్కీ డీప్' ఆశలు రేపెడుతున్నాయి. ఆ ఉచ్చులో పడి వ్యసనపరులు బలవుతున్నారు. ప్రజలను నష్టపరిచే చట్ట విరుద్ధ కార్యకలాపాల కట్టడి కోసం కఠినంగా చర్యలు చేపట్టడం ప్రభుత్వ విధి. తన బాధ్యత నెరవేర్చడంలో ఉదాసీనత వహించడం బాధ్యతారాహిత్యం. కోవిడ్ వ్యాప్తికి కోడి పందేలు వాహకాలుగా తయారు కావడం ఆందోళనకరం. ప్రజలకు సకల సంతోషాలనిచ్చేదే సంప్రదాయం. సమాజానికి చెడు చేసేది రుగ్మతే అవుతుంది.