Nov 25,2021 13:52

విజయవాడ : వైసిపి నేతలు మేనత్తను అంతేసి మాటలంటే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ సరిగ్గా స్పందించలేదని టిడిపి నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబానికి వైసిపి నేతలు క్షమాపణ చెప్పాలని ఆయన విజయవాడలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసిపి ఎమ్మేల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్‌ ఘాటుగా స్పందించ లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్‌ విఫలమయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య తెలిపారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య నిలదీశారు.
వల్లభనేని వంశీ ఫొటోలు పెట్టినప్పుడే ఎన్టీయార్‌ ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదని వర్ల అన్నారు. బూతుల మంత్రి పేర్నినానికి ఎన్టీయార్‌ అంటే చాలా భయమని, అలాంటి వారిని కంట్రోల్‌ చేసే శక్తి ఆయనకే ఉందని చెప్పారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవాళ్లే టిడిపి సభ్యులని వర్ల స్పష్టం చేశారు. జూనియర్‌ ఎన్టీయార్‌పై తాను చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని వర్ల రామయ్య ప్రకటించారు.