Oct 19,2021 01:02

రికార్డులను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌

ముంచంగిపుట్టు : గ్రామ సచివాలయానికి వచ్చే ప్రతి అర్జీదారుని విషయంలో సిబ్బంది జవాబుదారీతనంతో పని చేయాలని పాడేరు సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ అన్నారు. మండల కేంద్రంలోగల తహశీల్దార్‌ కార్యాలయంతో పాటు కిలగాడ, కర్రిముఖిపుట్టు, కించాయిపుట్టు, సుజనకోట గ్రామ సచివాలయాలను ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ ధ్రువపత్రాల కోసం అర్జీదారులు పెట్టుకున్న దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు పెండింగ్‌లో ఉండకూడదని సచివాలయ సిబ్బందికి సూచించారు. అనంతరం సచివాలయ ఉద్యోగుల, వాలంటీర్ల హాజరు పట్టికలను పరిశీలించారు. కర్రిముఖిపుట్టులో తాగునీరు, పింఛన్ల సమస్యలను పరిష్కారించాలని సబ్‌ కలెక్టర్‌ను గ్రామస్తులు కోరారు. వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. వీటిపై స్పందించిన అభిషేక్‌ సచివాలయాల్లో దరఖాస్తులు పెట్టుకుంటే వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. సచివాలయాల్లో ప్రభుత్వం కల్పించిన సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట తహశీల్దార్‌ ఎం.శ్యాంబాబు. ఎంపిడిఒ ఎవివి.కుమార్‌, సర్పంచ్‌లు రమేష్‌, సుభాష్‌, శివశంకర్‌, ఫుల్మెత్తి, ఎంపిటిసి సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.
కిలగాడలో సమస్యలపై వినతి
కిలగాడ గ్రామ సచివాలయాన్ని సందర్శించిన అభిషేక్‌కు స్థానిక సమస్యలపై సర్పంచ్‌ కోడా శివశంకర్‌ వినతిపత్రం అందజేశారు. పంచాయితీలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. అకారణంగా కొందరి రేషన్‌ కార్డులు, పింఛన్లు తొలగించారని చెప్పారు. పడాలపుట్‌ గ్రామానికి తారు రోడ్డు మంజూరు చేయాలని, రైతు భరోసా కేంద్రం, ఆసుపత్రి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరారు.