Apr 07,2021 20:54

సత్తెనపల్లి రూరల్‌ (గుంటూరు) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు కాల్పుల్లో అమరుడైన సిర్‌పిఎఫ్‌ జవాన్‌ శాఖమూరి మురళీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో మురళీకృష్ణ తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను హోం మంత్రి పరామర్శించారు. జవాను చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.30 లక్షల చెక్కును మురళీకృష్ణ తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి తల్లిదండ్రులు శాఖమూరి విజయకుమారి, రవీంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పెంచాలనీ, ఐదైకరాల భూమి ఇవ్వాలని కోరుతూ హోం మంత్రి సుచరితకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గుంటూరు ఆర్‌డిఒ ఎస్‌.భాస్కర్‌ రెడ్డి, తహశీల్దార్‌ ఎస్‌.రమణ కుమారి, గ్రామ పంచాయతీ సర్పంచ్‌ గుంటుపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గన్నారు. ఇదే విషయమై మురళీకృష్ణ కుటుంబానికి రూ.కోటి నగదు, ఐదెకరాల వ్యవసాయభూమి, ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్‌పార్టీ వర్కింగ్‌ అధ్యక్షులు మస్తాన్‌ వలి డిమాండ్‌ చేశారు.