Aug 18,2022 07:35

* సియాచిన్‌లో వెలుగుచూసిన మృతదేహం
హల్దావాని (ఉత్తరాఖండ్‌) :
పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా 1984లో చేపట్టిన సైనిక చర్యలో అదృశ్యమై అనంతరం అమరుడైన ఒక వీర జవానుకు బుధవారం నాడు పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. 38 సంవత్సరాల కిందటి నాటి యుద్ధంలో అదృశ్యమైన లాన్సే నాయక్‌ చంద్రశేఖర్‌ హర్బోలా అనే జవాను మృతదేహాన్ని సియాచిన్‌లో పురాతన బంకర్‌లో గుర్తించారు. లాన్సేనాయక్‌ మృతదేహాన్ని ఉత్తరాఖండ్‌లో హల్దానిలోని సరస్వతి విహార్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి పుష్కార్‌ సింగ్‌ దామితో సహాతో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై లాన్సేనాయక్‌కు నివాళులర్పించారు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రంలో చేపట్టిన 'ఆపరేషన్‌ మేఘదూత్‌'లో పాలుపంచుకున్న 20 మంది సభ్యుల సైనిక బృందంలో లాన్సే నాయక్‌ ఒకరు. అప్పట్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో భారీ మంచు తుపాను కురియడంతో ఈ ఆపరేషన్‌లోని 20 మంది గల్లంతయ్యారు. 15 మృతి దేహాలు స్వాధీనం చేసుకోగా, మరో ఐదుగురి ఆచూకీ తెలియకుండా పోయింది. ఆ ఐదుగురిలో లాన్సే నాయక్‌ ఒకరు. ఇంకా నలుగురి ఆచూకీ తెలియాల్సివుంది.