Sep 15,2021 19:18

సాహు.. ఓ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. అయితే- అయ్యో.. జీవితం ఇక ఇంతే అని నిట్టూరుస్తూ కూర్చోలేదు. కృత్రిమ కాళ్లు అమర్చుకుని మళ్లీ అడుగులేశాడు. అయితే నడవడం నేర్చుకున్నాక ఇక చాలనుకుని ఆగిపోలేదు. ఆ కాళ్లతోనే ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను ఎక్కే సాహసానికి పూనుకున్నాడు. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవాళ్లకే సాధ్యపడని అరుదైన ఫీట్‌ను పట్టుదలతో పూర్తి చేసి వైకల్యం శరీరానికే కానీ, మనసుకు కాదని నిరూపించాడు.


చత్తీస్‌గఢ్‌కు చెందిన సాహు ఏడేళ్ల క్రితం రారుపూర్‌ నుంచి బిలాస్‌పూర్‌కు వెళుతున్న ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాడు. బాతపార రైల్వే స్టేషన్‌లో మంచినీళ్ల కోసం రైలు దిగాడు. తను వచ్చే లోపే రైలు కదలడంతో రన్నింగ్‌లో ఎక్కేందుకు ప్రయత్నించి జారిపడ్డాడు. ప్రాణాలకు ప్రమాదం తప్పింది. ఒక కాలు పూర్తిగా కోల్పోయాడు. చికిత్స ఫలించకపోవడం వల్ల మరో కాలు కూడా తీసేయాల్సి వచ్చింది. దీంతో ఆర్మీలో చేరాలనుకున్న అతని కల చెదిరిపోయింది. ప్రమాదం తర్వాత అతనిపై చుట్టుపక్కల వారు చూపిన జాలి అతన్ని మరింత ధైర్యం కోల్పోయేలా చేసింది. కాళ్లు లేకపోతే ఏ పని చేయలేమా? అన్న ప్రశ్న అతన్ని నిత్యం వెంటాడింది. అప్పడే తనలాంటి ఎంతో మంది కాళ్లులేని వారిని కలిశాడు. వారి జీవితగాధలు విని సాహు ఓ నిర్ణయం తీసుకున్నాడు. తనలా నిస్సహాయ స్థితిలో ఉన్న వారందరికీ తానొక స్ఫూర్తిగా నిలవాలనుకున్నాడు. వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న 'జాన్‌ సమర్థ్య సొసైటీ' వ్యవస్థాపకుడు రాకేశ్‌ సింగ్‌ ఠాకూర్‌ను కలిశాడు. ఆయనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహంగా పని చేశాడు. వికలాంగులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం సుమారు 20 నెలల పాటు పోరాటం చేశాడు. ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టులో తన వాదనలు వినిపించి, చివరికి గెలిచాడు.

జయహో.. సాహూ..


అప్పుడే పట్టుదల ఉంటే కాళ్లు లేకున్నా... అనుకున్నది సాధిస్తామని నిరూపించే ప్రయత్నం మొదలుపెట్టాడు. కాళ్లపై ఎక్కువ ఒత్తిడి పడే పర్వాతాలు ఎక్కే సాహస యాత్ర ప్రారంభించాడు. ఆ దిశగా కృత్రిమ కాళ్లతో సాధన చేశాడు. తన జీవితం అర్థంతరంగా ముగిసిపోయిందని అనుకున్న వారందరికి తానేంటో తెలియజేయాలనుకున్నాడు. విజయం సాధించాలి అన్న దృఢ సంకల్పం తనని కఠినమైన దారుల్లోనూ ముందుకు నడిచేలా చేసింది. అప్పటివరకూ వీల్‌ఛైర్‌లో ఉన్న సాహు కృత్రిమ కాళ్లతో నడవడం నేర్చుకున్నాడు. కానీ వాటితో అతని నడక చిన్న పిల్లలు నడక నేర్చుకున్నట్టే ఉండేది. ప్రారంభంలో కిందపడిన సందర్భాలూ ఉన్నాయి. నడక కష్టంగా ఉన్న పరిస్థితులను అధిరోహించారు.

ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం, ఆస్ట్రేలియాలో ఎతైన మౌంట్‌ కోసియుస్కో పర్వతం, రష్యాలో మౌంట్‌ ఎల్బ్రస్‌ పర్వతం అతడి ప్రయత్నానికి తలవొంచాయి. ఆ శిఖరాలపై సమున్నత భారతదేశ పతాకను ఎగురవేశాడు. మౌనస్‌ 15-25 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు, 760 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, నిత్యం కురిసే మంచు... ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ ఆ పర్వతాలను అధిరోహించిన వ్యక్తిగా సాహు పేరు తెచ్చుకున్నాడు. అయితే అక్కడితోనే ఆగిపోలేదు. 14 వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్‌ చేశాడు. ఈ క్రమంలోనే స్కూబా (నీటి అడుగున డైవింగ్‌)లో జాతీయ స్విమ్మర్‌గా కూడా గుర్తింపు పొందాడు.

జయహో.. సాహూ..


'ఎత్తయిన శిఖరపు అంచుకు చేరుకొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది.' అని సాహు అంటున్నాడు. తన సాహస ప్రయాణం తనకి జీవితం పట్ల పూర్తి నమ్మకం కలిగించింది. ఈ క్రమంలోనే జీవితం పట్ల ఇతరుల్లో సానుకూల దృష్టిని ప్రేరేపించేందుకు రకరకాల కార్యక్రమాలకు హాజరై, తన జీవితాన్ని వివరిస్తున్నాడు. వికలాంగు హక్కుల పట్ల అవగాహన కల్పించే 'మిషన్‌ ఇంక్లూజన్‌' కార్యక్రమంలో పాల్గొని వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు.