Jan 17,2022 18:34

అమరావతి : ఇంటికి కాబోయే అల్లునికి పది రకాలు కాకుండా.. ఏకంగా వందల రకాల వంటకాలతో ఓ కుటుంబం ఆతిథ్యమిచ్చింది. ఓ రకంగా చెప్పుకోవాలంటే.. సంవత్సరంలో 365 రోజుల చొప్పున రోజుకొక వెరైటీ వంటకాలు, పిండివంటలతో వడ్డించడం విశేషం. ఇంతకీ ఇదెక్కడ జరిగిందనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. తణుకుకు చెందిన తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం కుమారుడు సాయికృష్ణకు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన విజయలక్ష్మీ జ్యూయలర్స్‌ అధినేత అత్యం వెంకటేశ్వరరావు కుమార్తె కుందవికి వివాహం నిశ్చయమైంది. అయితే వీరి పెళ్లికి ముందే సంక్రాంతి పండుగ రావడంతో.. పెళ్లి కుమార్తె తాత ఆచంట గోవింద్‌- నాగమణి దంపతులు కాబోయే నూతన వధూవరులకు నరసాపురంలో 365 రకాల వంటకాలతో ఘనమైన ఆతిథ్యం ఇచ్చారు. ఇందులో వంద రకాల స్వీట్లు, పులిహోర, దద్దోజనం, 30 రకాల కూరలతోపాటు రకరకాల పిండి వంటల్ని రుచి చూపించారు. ప్రస్తుతం సాయికృష్ణ, కుందవిల ముందు పెట్టిన వందల రకాల పిండి వంటకాలున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు 'గోదారోళ్లు ఆతిథ్యం అలా ఆషామాషీగా ఉండదుగా. అసలే సంక్రాంతి.. కాబోయే అల్లుడు ఇంటికొచ్చె.. ఇక ఆ వంటకాలు మామూలుగా ఉంటాయా'.. 'గోదారోళ్లంటే మజాకా' అంటూ కామెంట్లు పెడుతున్నారు.