Nov 21,2020 14:05

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 11 మందికి గాయలైనట్లు అధికారులు తెలిపారు. పేలుళ్లతో పాటు రాకెట్ల వర్షం కురిసిందని అన్నారు. 14కి పైగా రాకెట్లు ప్రయోగించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి తారిఖ్‌ ఆరిన్‌ తెలిపారు. పలు రాయబార కార్యాలయాలు, వ్యాపార సమూహాలు, అంతర్జాతీయ కంపెనీలు ఉన్న గ్రీన్‌జోన్‌కు అత్యంత సమీపంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారని అన్నారు. రాకెట్ల దాడితో పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. శనివారం ఉదయం పోలీసు వాహనంతో పాటు పలు ప్రదేశాల్లో రెండు చిన్నపాటి పేలుళ్లు జరిగాయని అన్నారు. అయితే ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించలేదు. ఖతార్‌లోని దోహాలో అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, తాలిబన్‌ నేతల మధ్య నేడు చర్చల జనగనున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం.