Jun 24,2022 01:43
భట్టిప్రోలు మండలం వెల్లటూరులో సిపిఎం నాయకులకు సమస్యలు వివరిస్తున్న పేదలు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని వెల్లటూరు చెన్నకేశవ కాలనీలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆ కాలనీకి చెందిన నిరుపేదలు సిపిఎం నాయకుల ఎదుట వాపోయారు. గురువారం ఇంటింటికీ సిపిఎం బృందం పర్యటించి సమస్యలపై సర్వే నిర్వహించింది. కాలనీ ఏర్పడి దాదాపుగా 15 ఏళ్ళు కావస్తున్నా నేటికీ సరైన రోడ్లు లేక అవస్థలు పడుతున్నామని, వర్షాకాలంలో మోకాటి లోతు బురదలో తిరగాల్సి వస్తోందని పేర్కొన్నారు. స్కూలుకు వెళ్లే పిల్లలు దూరంగా ఉన్న పాఠశాలకు బురదలో నడిచివెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రామానికి దూరంగా ఉన్న ఈ కాలనీలో కనీసం పాఠశాల కూడా లేకపోవటంతో దూరంగా కాలువ దాటి బడికి పంపిస్తున్నా మని పేర్కొన్నారు. కాలువపై ఉన్న నడక వంతెన కూడా శిథిలావస్థకు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని వాపోయారు. కాలనీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రం అద్దె గృహంలో నిర్వహిస్తున్నారని, పక్కా భవనం నిర్మించి ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నాయకులు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్‌, మండల కార్యదర్శి జి సుధాకర్‌, స్థానికులు కోటేశ్వరి, శ్రీనివాసరావు, రాణి తదితరులు ఉన్నారు.
ఇంటింటికీ సీపీఎం జనం కోసం సీపీఎం
కొల్లూరు: 'ఇంటింటికీ సిపిఎం, జనం కోసం సిపిఎం' కార్యక్రమం కొల్లూరు మండలంలో నిర్వహించారు. కొల్లూరు మండల గ్రామాలలో వ్యవసాయ కూలీలతో పని ప్రదేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొనిగల సుబ్బారావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. వేసవి అలవెన్స్‌ రద్దు చేయటం, రెండు పూటలా పనిచేయాలని షరతులు పెట్టటం, (పలుగు, పార) పనిముట్లను నేటికీ కూలీలకు ఇవ్వకపోవటం సరికాదని ఆయన పేర్కొన్నారు. తమ కూలి డబ్బులు నేటికీ చెల్లించలేదని ఆయా గ్రామాలలో కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కూలి డబ్బులు తమ ఎకౌంట్లో జమ చేయాలని, లేని పక్షంలో గ్రామ సచివాలయాల ముందు, కొల్లూరు మండల ఎంపిడిఓ ఆఫీస్‌ ముందు ధర్నా చేసేందుకు సిద్ధం అవుతామని కూలీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కనపర్తి వెంకట్రావు, కొణతం సాంబయ్య, శ్రీను, బూసి సాంబశివ, సుబ్బారావు రామకోటయ్య, సుజాత, బుజ్జి, వల్లూరి వెంకటేశ్వరరావు, మైలా ముసలయ్య, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.