Jul 03,2022 22:29

ప్రజాశక్తి - కడియం
కడియం బొబ్బిలి బ్రిడ్జి సెంటర్‌ నుంచి జేగురుపాడు వెళ్లే కాలువగట్టు రహదారి ఛిద్రంగా మారింది. మొత్తం గుంతలతో ప్రమాదకరంగా మారింది. పలు గ్రామాల ప్రజలు, రైతులు ఈ రహదారి గుండానే ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంటారు. పండిన పంటలను తరలించడానికి కూడా ఇదే ప్రధాన మార్గం. సుమారు దశాబ్దంన్నర క్రితం ఇక్కడ తారురోడ్డు నిర్మించారు. తర్వాత మరోమారు పునర్నిర్మించారు. అప్పటి నుంచి దీన్ని పట్టించుకోలేదు. సుమారు 4,800 మీటర్లు పొడవైన ఈ రహదారి మొత్తం గుంతలమయంగా మారింది. ఈ రహదారిపై గ్రావెల్‌, ఇసుక, మట్టి, నర్సరీ లారీలు అధిక లోడులతో రాత్రి, పగలు తేడా లేకుండా తిరగడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని స్థానికులు చెబుతున్నారు. గతేడాది తాత్కాలిక మరమ్మతు చేపట్టి అధికారులు చేతులు దులిపేసుకున్నారని, ప్రస్తుతం ఆ మరమ్మతులు కూడా లేవని తెలిపారు. కొంత మంది స్వతహాగా పెద్ద గోతులను పూడ్చినా, ఫలితం లేకుండా పోయింది. రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో పడి కొంత మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఈ రహదారిని నిర్మించాలని వారు కోరుతున్నారు. అవసరమైన చోట్ల కాలువలోకి మట్టి కుంగిపోకుండా రక్షణ గోడలు ఏర్పాటు చేయాలంటున్నారు.
మరమ్మతులైనా చేపట్టాలి
ఈ రహదారి మీదుగా వివిధ గ్రామాలకు ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. కడియంలో ప్రభుత్వ కార్యాలయాలకు రావాలంటే ఇదే ప్రధాన మార్గం. ఇటీవల కాలంలో పలువురు ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై గుంతల్లో పడి ప్రమాదాలకు గురయ్యారు. కనీసం తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టి ప్రమాదాల నుంచి కాపాడాలి.
- నాగిరెడ్డి సూర్య రామకష్ణ, ఎంపిటిసి సభ్యులు, జేగురుపాడు
నిధులు మంజూరు కాగానే పనులు
గతేడాది వరకూ గుత్తేదారుని కాలపరిమితిలో భాగంగా మరమ్మతులు చేపట్టాం. కాలపరిమితి ముగియడంతో మరమ్మతులు చేపట్టలేదు. పాట్‌ హోల్స్‌ పూడ్చడానికి, ఒక లేయర్‌ తారురోడ్డు వేయడానికి రూ.48 లక్షల వరకూ అవుతుంది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం.
- సిహెచ్‌ త్రిమూర్తులు, మండల ఇంజినీరింగ్‌ అధికారి,
కడియం మండలం.