Feb 06,2023 23:27

పాదయాత్ర చేస్తున్న రుద్రరాజు, కాంగ్రెస్‌ నాయకులు

ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకులు రాహుల్‌ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు మద్దతుగా అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సోమవారం అనకాపల్లిలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక గుండాలు వీధి జంక్షన్‌ నుంచి ప్రారంభించి నెహ్రూ చౌక్‌ జంక్షన్‌ మీదుగా జీవిత బీమా కార్యాలయం వరకు ఈ పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ 3750 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొడుతుందని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించడంలో విఫలమైందని విమర్శించారు. అదానీ సంస్థలపై హిండెన్‌ బర్గ్‌ ఇచ్చిన నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ, లేదా దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన జడ్జితో నిష్పాక్షిక విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కొప్పుల రాజు, రాకేశ్‌ రెడ్డి, మీసాల సుబ్బన్న, వెంకటేష్‌, గుత్తుల శ్రీనివాస్‌, శ్రీరామ్మూర్తి, దత్తు, బొడ్డు శ్రీనివాస్‌, బోయిన భానుమూర్తి యాదవ్‌, మలుపు రెడ్డి కోటేశ్వరరావు, పడాల కొండలరావు, కాళ్ల వెంకట సత్యనారాయణ, కత్తెర శ్రీధర్‌, కిముడు దేవి, జగత శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.