Dec 08,2022 23:07

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ 

విఎంసిలో ఏళ్ళ తరబడి పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బోయి సత్యబాబు డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ సర్కిల్‌- 1 కమిటీ ఆధ్వర్యంలో గురువారం శానిటరీ కార్మికుల జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సిఐటియు జిల్లా కార్యదర్శి బి సత్యబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలు, కార్మిక హక్కులు హరించే నిర్ణయాలను అడ్డుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్‌ మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయా లన్నారు. మున్సిపల్‌ కార్మికులకు ఆదివారం పూర్తి శెలవు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఈ సమస్యల సాధన కోసం ఈనెల 15, 16 తేదీల్లో విజయవాడ వన్‌టౌన్‌లో జరిగే సిఐటియు ఎన్‌టిఆర్‌ జిల్లా 11వ మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపు నిచ్చారు. అలాగే 15వ తేదీ జరిగే ర్యాలీ, బహిరంగ సభలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పశ్చిమ నగర అధ్యక్షులు జి. వెంకట్రావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ పశ్చిమ నగర అధ్యక్ష కార్యదర్శులు వై. ఏడుకొండలు, వి. సాంబులు తదితరులు పాల్గొన్నారు.