Jul 30,2021 07:02

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరల భరోసా, వ్యవసాయ సేవల చట్టాన్ని (కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టం) వెంటనే రద్దు చేయాలని కిసాన్‌ సంసద్‌ డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వ తీరుగా నిరసనగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రైతులు నిర్వహిస్తున్న ఈ కిసాన్‌ సంసద్‌ గురువారం కూడా కొనసాగింది. జోరుగా వర్షం కురుస్తున్నా అన్నదాతలు మొక్కవోని దీక్షతో సంసద్‌ నిర్వహించడం విశేషం. మూడు సెషన్లుగా ఈ సమావేశాల్లో చర్చల అనంతరం కాంట్రాక్టు ఫార్మింగ్‌ చట్టం రైతు వ్యతిరేకమైన చట్టమని నిర్ధారించారు. దీంతో ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు కిసాన్‌ సంసద్‌ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని రద్దు చేయాలని కిసాన్‌ సంసద్‌లో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. మొదటి సెషన్‌కు ప్రేమ్‌ సింగ్‌ భాంగు, గుర్నమ్‌ సింగ్‌ చాదుని, రెండో సెషన్‌కు అతుల్‌ కుమార్‌ అంజన్‌, గగన్‌దీప్‌ సింగ్‌, మూడో సెషన్‌కు అనురాధ భార్గవ్‌, హర్బన్స్‌ సింగ్‌ సంఘ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లగా వ్యవహరించారు. కిసాన్‌ సంసాద్‌ పరిష్కరించిన అంశాలపై పార్లమెంటు ఆధిపత్యానికి పోకుండా చూడాలని రాష్ట్రపతిని కోరింది.
చట్టం శీర్షిక కూడా మోసపూరితమే
మోడీ ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చట్టాన్ని మోసపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే శీర్షికను ఇచ్చిందని కిసాన్‌ సంసద్‌ విమర్శించింది. ''రైతుల సాధికారత మరియు రక్షణ లేదా ధర భరోసా'' అనే పదాలను చట్టం శీర్షికలో ఉపయోగించినప్పటికీ, ఇది కేవలం ''కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ మరియు కార్పొరేట్‌ ఫార్మింగ్‌ ప్రమోషన్‌ యాక్ట్‌'' అని స్పష్టం చేసింది. ఇది వనరుల దోపిడీకి దారితీస్తుందని విమర్శించింది.
భూమి అన్యాక్రాంతం, వ్యవసాయం రైతుల చేతుల్లో నుండి కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లి ఇతర దేశాలలో ఇలాంటి విధానాల ద్వారా జరిగిందని తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ రైతుకు కంపెనీ సరసమైన ధర చెల్లించేలా చూసే నిబంధనలు లేవని స్పష్టం చేసింది. ''వ్యవసాయం, మార్కెట్లు'' రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి సంబంధించినవని, అయితే కాంట్రాక్ట్‌ వ్యవసాయం, వ్యవసాయ వ్యాపార సంస్థల పద్ధతులను నియంత్రించడానికి కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ ప్రమోషన్‌ యాక్ట్‌ రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను తొలగిస్తుందని తెలిపింది.