
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, యూనివర్సిటీలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సిఎం ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఎపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జెఎసి రాష్ట్ర ఛైర్మన్ ఎవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్షణ తదితర పథకాలలో ప్రభుత్వ శాఖలు, సంస్థల ఉద్యోగులకు తక్షణం మినిమం టైంస్కేల్ వర్తింపజేయాలని కోరారు. టిటిడిలో గత 695 రోజులుగా రిలేదీక్షలు చేస్తున్న అటవీ కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపారు. టిటిడి కార్మికుల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. అందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలుగా పెంచాలని డిమాండ్ చేశారు. రెగ్యులరైజేషన్ హామీని మరచిపోయి, ఆప్కాస్ పేరుతో కార్పొరేషన్లో కలపడం హామీని అమలు చేసినట్లా అని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్రంలోని కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మరిన్ని సౌకర్యాలను, వేతనాలను పెంచాలని, కొత్త పిఆర్సి కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా .జెఎసి ఛైర్మన్ గండికోట వెంకటేష్, సెక్రటరీ లోకేష్‌బాబు, వెటర్నరీ యూనివర్సిటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గండికోట చిన్నబాబు పాల్గొన్నారు.