Jun 11,2021 21:31

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కార్లు

కంటోన్మెంట్‌ : కార్లు అద్దె చెల్లిస్తామని మోసాలకు పాల్పడే ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్‌పి బి.రాజకుమారి తెలిపారు. వీరిని ఇద్దర్ని అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, వీరి నుంచి 29కార్లును పార్వతీపురం పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, వీటి విలువ సుమారు రూ.2కోట్లు ఉంటుందని చెప్పారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌పి మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం తురాయివలస గ్రామానికి చెందిన పిన్నింటి రాజేష్‌ ఫిర్యాదు మేరకు ఈ కేసులు బయటపడింది. వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం పట్టణం వైకెఎం కాలనీకి చెందిన మర్రాపు చంద్రమౌళి (ఎ-1) కారును నెలకు రూ.29 వేలు అద్దె చెల్లించేందుకు లోలుగ శివ రామకష్ణ ద్వారా రాజేష్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో తన కారును అప్పగించాలని కోరినప్పటికీ, చంద్రమౌళి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి, ఆరా తీయడంతో తన కారును నారాయణపురంకు చెందిన ఒక వ్యక్తి వద్ద తనఖా పెట్టినట్లు తెలిసింది. దీంతో తన కారును, అద్దెను ఇప్పించి, న్యాయం చేయాల్సిందిగా రాజేష్‌ ఫిర్యాదుపై పార్వతీపురం పట్టణ దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో భాగంగా చంద్రమౌళిని అదుపులోకి తీసుకొని విచారించగా, నిందితుడు వేర్వేరు వ్యక్తుల నుంచి 29 కార్లను అద్దెకు తీసుకొని, వాటిని తన అవసరాల కోసం ఇతరుల వద్ద రూ.2-2.5 లక్షలకు తనఖా పెట్టినట్లు అంగీకరించాడు. బత్తిలి, పాతపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో తన స్నేహితులు బొబ్బిలికి చెందిన సీమంతుల రవి (ఎ-2), సీతంపేటకు చెందిన లోలుగ శివ రామకృష్ణ (ఎ-3) సహకారంతో కార్లను అద్దెకు తీసుకొని, వాటిని పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట ప్రాంతాల్లోని ఇతరుల వద్ద రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షలకు తనఖా పెట్టి, వారి నుండి డబ్బులు తీసుకొని తన అవసరాలను తీర్చుకొనే వారన్నారు. నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం పార్వతీపురంలో 9, బొబ్బిలిలో 4, బలిజిపేటలో 10, విజయనగరంలో 6 కార్లును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులైన చంద్రమౌళిని, శివరామకృష్ణను పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు సీమంతుల రవి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్‌, సిఐ సిహెచ్‌. లక్ష్మణరావు, పట్టణ,రూరల్‌ ఎస్‌ఐలు జి.కళాధర్‌, ఎస్‌ఐ జి.వీరబాబు, బత్తిలి ఎస్‌ఐ కె.వి.సురేష్‌, పార్వతీపురం పట్టణ ఎఎస్‌ఐ వి.రవి, కాని స్టేబులు కె.శ్రీనివాసరావు, బత్తిలికానిస్టేబుళ్ళు ఎ.రాంబాబు, పి.రమణను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి అభినందించారు.