Aug 07,2022 22:26

ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు నాయకులు
కార్మికుల నిధులను వారికే ఖర్చు పెట్టాలి
ప్రజాశక్తి-బిట్రగుంట : కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం కేటాయించిన నిధులను వారికే ఖర్చు పెట్టాలని జిల్లా సిఐటియు అధ్యక్షులు చాన్‌బాషా పేర్కొన్నారు. మండలంలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం సిఐటియు మండల సమావేశాన్ని మండల సిఐటియు కార్యదర్శి చల్లా నరహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా సిఐటియు అధ్యక్షులు చాన్‌బాషా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల విషయంలో చిన్న చూపు చూస్తుందని వారికి కేటాయించిన నిధులను ప్రక్కదోవ పట్టించి భవన నిర్మాణ కార్మికులకు ద్రోహం చేస్తుందని, రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఏకమై నిరసన తెలపాలన్నారు.
మండల సిఐటియు నాయకులు చల్లా నరహరి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన వారికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించడం లేదని వారికి కేటాయించిన నిధులను వారికే ఉపయోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మండల సిపిఎం కార్యదర్శి తుమ్మల వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వందల కోట్ల రూపాయలను విడుదల చేసిన ఇప్పటివరకు చనిపోయిన కార్మికులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదని గడిచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం కార్మికులను చిన్నచూపు చూస్తుందని తెలిపారు. మాజీ సిపిఎం మండల కార్యదర్శి కాకుమాని చిన్న వెంకయ్య మాట్లాడుతూ లేబర్‌ యాక్ట్‌ ప్రకారం భవన నిర్మాణ కార్మికులకు కేటాయించిన ప్రతి రూపాయి వారికే చెందాలని మండలంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కలిసి నిరసనను తెలిపి మన హక్కులను పోరాడి చేయించుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కడనూతల సిపిఎం నాయకులు శ్రీనివాసులు, ఎస్‌ కె అన్వర్‌ భాషా, భవన నిర్మాణ కార్మికులు. తదితరులు పాల్గొన్నారు.