Jun 01,2023 23:30

మాట్లాడుతున్న అప్పలరాజు, సంఘం నాయకులు

ప్రజాశక్తి-ఎస్‌.రాయవరం:మండలంలో ఏటిి కొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులకు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్‌ అప్పలరాజు, ఫ్యాక్టరీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు డిమాండ్‌ చేశారు. ఏటికొప్పాకలో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, 2020-2021 క్రషింగ్‌ సీజన్‌ నుండి కార్మికులకు వేతన బకాయిలు 8 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. 2 క్రసింగ్‌ సీజనులు ముగుస్తున్నా నేటికీ వేతనాలు చెల్లించక పోవడంతో కార్మికులు పస్తులతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు పిఎఫ్‌ బకాయిలు, గ్రాడ్యూటీ ఇతర బెనిఫిట్స్‌ చెల్లించలేదని, దీంతో 40 సంవత్సరాలకు పైగా కార్మికులు చేసిన కష్టానికి ఏ విధమైన ప్రతిఫలం అందలేదన్నారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వెంటనే కార్మికులకు వేతన బకాయిలను, ఇతర అన్ని బెనిఫిట్స్‌ వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాక్టరిని తెరిపించి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. త్వరలో రాష్ట్ర పారిశ్రామిక మంత్రి గుడివాడ అమర్నాథ్‌, ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు తెలియ జేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ యూనియన్‌ నాయకులు కరెడ్ల సత్యనారాయణ, గుండుబోగుల గోవిందరావు, రాయవరపు హానుమంతురావు, కోరిబిల్లి రమణ, పీలా గోవింద్‌, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.