Mar 01,2021 07:25

విషాదం... విషాదమే
లక్షలాది కలల్ని చిదిమేస్తున్న విషాదం
సజీవ సమాధులకు మట్టిపోస్తున్న విషాదం
మనిషిని, మనసుని కలగలిపి పాతరేస్తున్న విషాదం..

తెలుగు నేలని తలకిందులుగా పిండేసి
ఏక స్వరంతో ఉగ్రజ్వాలైన ఉద్యమం
ఇనుప లాఠీలకి పిడికిలై సమాధానించిన ఉద్యమం
ముప్పయ్యారు ప్రాణాల ఉసురుతో జ్వాలాతోరణమై
కేంద్రం గుండెల్లో భయం పురివిప్పిన ఉద్యమం..
అలనాటి ఆంధ్రుల స్ఫూర్తి పెను ఉప్పెనలా మారి
ఉక్కు పూలు ప్రభవించిన ఉద్యమం..

చెట్టు విరగకాచినప్పుడు అమ్ముకుని
ఆకులు రాల్చినప్పుడు గొడ్డలి పట్టుకుని
ఒక్క గనీ కేటాయించని కపటి ప్రేమ
తలంటను కార్పొరేట్‌ నీళ్ళతో సిద్ధమైంది!

ఇప్పుడు ప్రతి శ్వాస ఓ పెనుకేక
ఆంధ్రుల గౌరవాన్ని మోస్తున్న ఉక్కు పతాక
మాయమాటల్ని నమ్మే పరిస్థితి లేదు
ప్రతి పౌరుడూ బతుకు రైతుగా నిలబడి
చట్టాల్ని ప్రశ్నిస్తున్న కొడవలిగా మారుతున్నాడు!

ఆకులు రాల్చిన చెట్టు మళ్ళీ చిగురిస్తుందని
మళ్ళీ మళ్ళీ కాయలు కాచి పులకిస్తుందని తెలుసు
తెలిసిన తెలివిడి పైన కార్పొరేట్‌ కార్ముకం..
తెలుగుగడ్డపై మళ్ళీ ఎగసిన చేతులు
జనఘోషై మరోసారి ఉప్పెనగా మారుతుంటే
కబోది పాలకులకు తపోభంగం కాక తప్పదు..!
- డాక్టర్‌ పెరుగు రామకష్ణ
98492 30443